కేర్ టేకర్​గా చేరి.. ఇంట్లో చోరీ

కేర్ టేకర్​గా చేరి.. ఇంట్లో చోరీ

కూకట్​పల్లి, వెలుగు: పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఓ కేర్​ టేకర్​ను పోలీసులు అరెస్టు చేశారు. కూకట్​పల్లి ఏసీపీ చంద్రశేఖర్ ​తెలిపిన ప్రకారం.. వివేకానందనగర్​కాలనీలో ఉండే శైలజ భర్త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్తను చూసుకునేందుకు ఓ కేర్​ టేకర్​ కావాలని బోడుప్పల్​లోని అన్నపూర్ణ హోం కేర్​సర్వీసెస్ ​సంస్థను శైలజ సంప్రదించింది. సదరు సంస్థ నిర్వాహకులు గత నెల చివరి వారంలో చంటికుమార్(28) అనే యువకుడిని శైలజ ఇంటికి కేర్​ టేకర్​గా పంపించారు. ఈ నెల 6న శైలజ బయటకు వెళ్లగా.. ఇంట్లోని బంగారు నగలు, వెండి వస్తువులను తీసుకుని చంటికుమార్  పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.