కరీంనగర్ నుంచే ట్యాపింగ్​కు స్కెచ్

కరీంనగర్ నుంచే  ట్యాపింగ్​కు స్కెచ్
  • బీఆర్ఎస్ నేతకు చెందిన హోటల్​లో రాధాకిషన్ రావు మకాం
  • ప్రత్యర్థుల డబ్బులు పట్టుకోవడంలో ఆయనదే కీలకపాత్ర 
  • రేవంత్  సన్నిహిత నేతల ఫోన్లూ ట్యాప్
  • సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్
  • బాధితులు, నిందితుల్లో చాలా మందికి ఉమ్మడి జిల్లాతో అనుబంధం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్  మధ్య ఆరోపణలతో వేడెక్కుతున్న రాజకీయం

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  సర్కార్  హయాంలో జరిగిన ఫోన్  ట్యాపింగ్  కేసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతల పేర్లే ఎక్కువగా ఉండడం, ట్యాపింగ్  వల్ల ఈ జిల్లాకు చెందిన బీఆర్ఎస్  నేతలు లబ్ధి పొందడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్  ట్యాపింగ్  వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే కేటీఆర్  ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో వార్ రూమ్  నిర్వహించినట్లు విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. 

అంతేగాక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్, ఇంటెలిజెన్స్  మాజీ చీఫ్​ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో కొందరితో బంధుత్వం కలిగి ఉండడం, వారు తరుచూ కరీంనగర్  వచ్చి వెళ్లడం, ఈ జిల్లాకు చెందిన కీలక నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జువ్వాడి నర్సింగారావు, సత్తు మల్లేశ్​ తదితరులతో పాటు వారి పీఏలు, సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్  చేయడం హాట్  టాపిక్ గా మారింది. దీంతో తమ ఫోన్లు ట్యాప్  అయ్యాయంటూ బీఆర్ఎస్  సర్కార్ హయాంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. 

సొంత మనుషులనే అనుమానించేలా చేసిన్రు.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్  చేశామంటూ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించింది. ఫోన్  ట్యాపింగ్  ద్వారా కాంగ్రెస్  నేతల పర్సనల్  విషయాలను, రాజకీయ వ్యూహాలను పసిగట్టిన బీఆర్ఎస్  పెద్దలు.. వారిని ఇబ్బందికి గురి చేసేలా పోలీసులను రంగంలోకి దింపడం, కాంగ్రెస్  లీడర్ల మధ్య విబేధాలు సృష్టించేలా వ్యవహరించేవారు. 

దీంతో కాంగ్రెస్  నేతలు తమ విషయాలు ప్రత్యర్థులకు ఎలా తెలిశాయో అర్థంగాక సొంత పీఏలను, డ్రైవర్లను అనుమానించే పరిస్థితికి వెళ్లారు. తనకు సంబంధించిన సంభాషణలు ఎలా లీకయ్యాయో అర్థంగాక చివరికి తన పీఏను కూడా ఓ సందర్భంలో అనుమానించానని కరీంనగర్  డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాటి ఘటనలను మంగళవారం గుర్తు చేశారు.  

అసెంబ్లీ ఎన్నికలప్పుడు జిల్లాలోనే ఎస్ఐబీ టీమ్..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ లోని ప్రముఖ హోటల్ లో రాధాకిషన్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబీ టీమ్  మకాం వేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పలువురు అభ్యర్థుల నగదు భారీగా పట్టుబడిన విషయంలోనూ రాధాకిషన్ రావుదే కీలక పాత్ర అని తెలిసింది. ఎన్నికల సమయంలో తమ క్యాంపెయిన్, ఆర్థిక వనరులు, పార్టీలో చేరికలకు సంబంధించి ఫోన్లలో మాట్లాడుకున్న అనేక విషయాలు లీకైతే.. అనవసరంగా తమ అనుచరులను అనుమానించామని ఇదంతా ఫోన్  ట్యాపింగ్  ద్వారా అని తెలిసి షాక్ కు గురయ్యామని జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు.

జిల్లా నుంచే ఆరోపణలు..

ఫోన్  ట్యాపింగ్  వ్యవహారం కాంగ్రెస్  సర్కార్  అధికారంలోకి వచ్చాక వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ విషయంపై హుజురాబాద్  బై ఎలక్షన్ సమయంలో కరీంనగర్ లోని మైత్రి హోటల్  వేదికగా తొలిసారిగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఈ ట్యాపింగ్  జరుగుతున్నట్లు ఆరోపించారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు సిరిసిల్లలో వార్ రూమ్  నడిపినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ రావు, గోపాల్ రావు, దుగ్యాల ప్రణీత్ రావు సహా 30 మంది ఆఫీసర్లు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని కూడా ఆరోపించారు. చివరికి ఆయన ఆరోపణలే నిజమని తేలింది. ఫోన్  టాపింగ్  కేసులో తొలి అరెస్ట్​ కూడా ఉమ్మడి కరీంనగర్  జిల్లాలోనే జరిగింది. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్  చేశాకే ఫోన్  ట్యాపింగ్  కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.