రావు సాబ్.. రావాల్సిందే! కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు

రావు సాబ్.. రావాల్సిందే! కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు
  •  56 మందిని ప్రశ్నించిన పోలీసులు
  •  అందరి చూపు ప్రభాకర్ రావు వైపు
  •  లుక్ అవుట్ నోటీసులిచ్చినా రాలే
  •  కేంద్రం సాయంతో రప్పించే యత్నం
  •  ట్యాపింగ్ టీంతో టచ్ లో ఉన్నారా?
  •  అనుమానిస్తున్న పోలీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అయిన ప్రభాకర్ రావు వస్తేనే పూర్తి వివరాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఈ కేసులో  ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. అనారోగ్యం బారిన పడిన ఆయన అమెరికాలో  వైద్యసేవలు పొందుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు బాధ్యులుగా భావిస్తున్న 56 మందిని పోలీసులు ప్రశ్నించారు. అందరూ అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెబుతున్నారు.

 నిందితుల కన్ఫెషన్ స్టేట్ మెంట్లలోనూ అందరూ ప్రభాకర్ రావు పేరునే ప్రస్తావించారు. ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేయించారనేది తేలాలంటే అమెరికాలో ఉన్న ఆయన రావాల్సిందే. ఈ తతంగం వెనుక ఉన్న వారి గుట్టు బయట పెట్టాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నేరస్థులకు శిక్షలు పడేలా సీనియర్ పీపీలను ప్రత్యేకంగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

ప్రభాకర్ రావు నోరు విప్పితే..

గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు నోరు విప్పితే ఏమౌతుందోనన్న టెన్షన్ కొందరు లీడర్లు పట్టి పీడిస్తున్నట్టు సమాచారం. ఈ కేసు లో ఏ4గా ఉన్న ఎస్ఐబీ డీసీపీ రాధాకిషన్ రావు తన నేరాంగీకార పత్రంలో బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. అయితే వీళ్లందరికీ చీఫ్​ గా ఉన్న ప్రభాకర్ రావును అరెస్టు చేసి ప్రశ్నిస్తే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వాళ్లంతా బయటికి వస్తారని పోలీసులు భావిస్తున్నారు.

 రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ తో ప్రభాకర్ రావు ఏకీ భవిస్తారా..? ఆయన ఇంకెవరి పేర్లు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న నేతలు కొందరు ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాకుంటే బాగుండు..! అనే  ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావును విచారిస్తే ఎన్ని వార్ రూమ్ లు పెట్టారు..? ఎక్కడెక్కడ పెట్టారు..? ఈ ఆపరేషన్ లో భాగస్వాములైన వారెవరు..? ఎవరి ఆదేశాల మేరకు చేశారు. ఏయే సమాచారాన్ని గత ప్రభుత్వ పెద్దలకు అందించారు..? అన్న విషయాలు తేలే అవకాశం ఉంది. 

రప్పించడం ఎలా?

అమెరికాలో ఉన్న ఎస్ఐబీ చీఫ్​ ప్రభాకర్ రావును రప్పించడం ఎలా..? అన్నది ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇప్పటికే ఆయనకు  పోలీసు శాఖ  లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తేలాలంటే కచ్చితంగా ఆయను రప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడు.. అప్పట్లో ఎస్ఐబీ చీఫ్. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న కన్ఫెషన్ స్టేట్ మెంట్ల ఆధారంగా అప్పటి అధికార పార్టీ లీడర్లకు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ కేసు ఎట్టి పరిస్థితిలోనూ మిస్ కావద్దని భావిస్తున్న పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.