
- ఐదుగురిపై కేసు నమోదు
చివ్వెంల, వెలుగు : ముగ్గురు వ్యక్తులపై హత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగల లక్ష్మయ్య రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. సూర్యాపేట మున్సిపల్ పరిధి కుడకుడకు చెందిన గోపికి రాళ్లు అమ్మగా రూ.3 వేలు ఇవ్వాల్సి ఉంది. ఆ పైసలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండగా శుక్రవారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, అక్కడ ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగింది.
దీంతో లక్ష్మయ్యతో పాటు అతని ఇద్దరు భార్యలపై గోపి అతని ముగ్గురు ఫ్రెండ్స్ దాడికి పాల్పడ్డారు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి బాధితులు బైక్ పై వెళ్తుండగా కారులో వెంబడించారు. మార్గమధ్యలో సూర్యాపేట టౌన్ శివారు బీబీగూడెం పరిధిలోని మధుర వైన్స్ వద్ద అడ్డగించారు. లక్ష్మయ్యతో పాటు అతని ఇద్దరు భార్యలపై కట్టెలు, కత్తితో హత్య చేసేందుకు యత్నించారు.
అప్రమత్తమైన లక్ష్మయ్య భయంతో వైన్ షాప్ లోకి వెళ్లి దాక్కున్నాడు. స్థానికులు అడ్డుకోవడంతో గోపి, అతని ఫ్రెండ్స్ పారిపోయారు. దాడిపై బాధితుడు లక్ష్మయ్య చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కుడకుడకు చెందిన రాము, శేఖర్, చంటి, గోపి, మహేశ్ ను నిందితులుగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వల్లపు మహేశ్వర్ తెలిపారు.