కిషన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డిలపై కేసు నమోదు

కిషన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డిలపై కేసు నమోదు

కోవిడ్‌కి సంబంధించి ప్రభుత్వ నిబంధనలను ఎవరు బ్రేక్ చేసినా కేసులు తప్పవని నల్గొండ డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. సీఎం సభకు కోవిడ్  నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ‘ముఖ్యమంత్రి సభను అడ్డుకోవడానికి చూసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ పార్టీలన్నింటికీ కరోనా నిబంధనలు వర్తిస్తాయి. 17వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు అధికారులను, ఉద్యోగులను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటాం. ఎవరైనా రెచ్చగొడితే కార్యకర్తలు రెచ్చిపోవద్దు. ఆ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటివారిపై కేసులు తప్పవు. ఇప్పటివరకు కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ సాగర్ అభ్యర్ది భగత్ కుమార్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేశాం. అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కూడా కేసులు నమోదుచేస్తున్నాం’ అని డీఐజీ రంగనాథ్ తెలిపారు.

నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తుందని.. దాంతో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ‘సీఎం సభకు వచ్చేవారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానమున్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలి’ అని ఆయన అన్నారు.