పులుల మరణానికి ఆదివాసీలపై కేసులా? మానవ హక్కుల వేదిక డిమాండ్

పులుల మరణానికి ఆదివాసీలపై కేసులా? మానవ హక్కుల వేదిక డిమాండ్

ఆసిఫాబాద్, వెలుగు: కాగజ్ నగర్ మండలం దరిగాం అడవిలో పులుల మృతికి బాధ్యులను చేస్తూ ఆదివాసీ యువకులపై కేసులు మోపడం అన్యాయమని, వారిని వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్  తిరుపతయ్య డిమాండ్  చేశారు. ఈనెల 6, 8న చనిపోయిన రెండు పెద్దపులుల విషయంలో వాంకిడి మండలం రింగారెట్  గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి రిమాండ్ కు పంపిన కేసులో ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది.

ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుంచి ఆదివాసీలు తమ పశువులను మేత కోసం దరిగాం అడవికి తీసుకెళ్తారని, ఈ నేపథ్యంలో రింగారెట్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడి ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయిందన్నారు. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో దాని యజమాని అటవీ అధికారులకు తెలియజేయలేదన్నారు. దరిగాం అడవిలో పులి చనిపోయి ఉందని గ్రామస్తులు సమాచారం అందిస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదన్నారు. పులుల మృతికి కారణమంటూ మైనర్  బాలుడితో పాటు కోవ గంగు, ఆత్రం జలపతిని అదుపులోకి తీసుకుని వారితో బలవంతంగా అబద్ధం చెప్పించారన్నారు. ఫారెస్ట్  అధికారులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక చేయని నేరాన్ని వారు ఒప్పుకున్నారని తెలిపారు. పులుల బారిన మనుషులు, పశువులు చనిపోకుండా ప్రభుత్వం ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో వెంటనే ప్రకటించాలని డిమాండ్   చేశారు.