మొయినాబాద్ ఘటనలో ముగ్గురిపై కేసులు

మొయినాబాద్ ఘటనలో ముగ్గురిపై కేసులు

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను లంచంతో ప్రలోభ పెట్టారంటూ ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్ కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన వెంకటనాథ సింహయాజి, హైదరాబాద్ కు చెందిన వ్యాపారి నందకుమార్ అనే వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తాము బీజేపీలో చేరాలంటూ రూ.100 కోట్ల డీలింగ్ జరిగిందని, మిగతా ఎమ్మెల్యేలను కూడా తీసుకువస్తే రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ ముగ్గురిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరాలని తనపై ముగ్గురు ఒత్తిడి తెచ్చారని, డీలింగ్ లో భాగంగానే వాళ్లు తన ఫామ్ హౌస్ కు వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. కేసులు నమోదైన ముగ్గురిని రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. 

మొయినాబాద్ ఎపిసోడ్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తనిఖీలు చేశారు. నందు అనే వ్యక్తి చెబుతున్నట్లుగా పూజల కోసమే స్వామిజీలు వచ్చారా..? అనే అనుమానాలు తెరపైకొస్తున్నాయి. మరోవైపు పూజల కోసమే తాము వచ్చామని నందు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారో అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫాంహౌస్ లోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. నందు అనే వ్యక్తికి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి..? అనే దానిపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పార్టీ అప్పజెప్పిన పని చేశానంటూ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అప్పగించిన పని ఏంటి..? అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం మొయినాబాద్ ఎపిసోడ్ లో సమాధానాలు లేని ప్రశ్నలెన్నో తెరపైకొస్తున్నాయి. 

మునుగోడు ఉప ఎన్నిక వేళ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేచింది. హైదరాబాద్‌‌ శివారు మొయినాబాద్‌‌ మండలం అజీజ్‌‌నగర్‌‌లోని ఫామ్ హౌజ్ లో 26వ తేదీ సాయంత్రం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో ముగ్గురు వ్యక్తులు డీల్ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు వెళ్లి.. సోదాలు చేశారు. ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడ్డట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. 

ముగ్గురు వ్యక్తులను బీజేపీనే రంగంలోకి దింపి, తమ ఎమ్మెల్యేలను వంద కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్​ఎస్​ ఆరోపిస్తుండగా... ఇదంతా ప్రగతిభవన్​ డైరెక్షన్ లో టీఆర్​ఎస్​ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడుతోంది. ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమని సవాల్​ చేసింది. ఫామ్ హౌస్ వేదికగా జరిగిన ఈ పొలిటికల్​ హైడ్రామాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు : సీపీ రవీంద్ర
డీల్​ వ్యవహారంపై టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని సీపీ స్టీఫెన్​ రవీంద్ర మీడియాకు తెలిపారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్ర భారతి ఈ సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో  రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో ఉంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కు చెందిన నందకుమార్  ఇక్కడ ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి, ప్రలోభ పెట్టారని చెప్పారు.  డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని చెప్పారన్నారు” అని అన్నారు. లీగల్ ఒపీనియన్‌‌ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.