గణేశ్‌‌ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ.. .జగిత్యాల మండలం కల్లెడలో ఘటన

గణేశ్‌‌ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ.. .జగిత్యాల మండలం కల్లెడలో ఘటన

జగిత్యాల రూరల్, వెలుగు: గణేశ్ చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గాలి పెల్లి అంజి, గాలి పెల్లి అరుణ్, గాలిపేల్లి లచ్చయ్య, గాలిపెల్లి సూర్యవంశీ.. ఇటీవల నిర్వహించిన గణేశ్ నవరాత్రుల నిర్వహణకు చందా ఇవ్వలేదు. దీంతో కుల పెద్దమనిషి గాలిపెల్లి రాజేందర్.. ఆ నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేసి, తమతో ఎవరూ మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే రూ. 25 వేల జరిమానా విధిస్తామని ఊళ్లో దండోరా వేయించినట్లు బాధితులు తెలిపారు. గాలిపెల్లి అంజి ఫిర్యాదు మేరకు రాజేందర్, అశోక్, రాజయ్య, మహేశ్‌‌తోపాటు మరో ఐదుగురిపై, అలాగే రాజేందర్ ఫిర్యాదు మేరకు అంజిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.