సాగర్ బరిలో కులానికే ప్రాధాన్యత

సాగర్ బరిలో కులానికే ప్రాధాన్యత
  • ఉప ఎన్నికలో యాదవ, లంబాడా, రెడ్డి కమ్యూనిటీలకు పార్టీల ప్రాధాన్యం
  • జానారెడ్డి, భగత్, రవి నాయక్​ అభ్యర్థిత్వాలు ఫైనల్​

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా జానారెడ్డి పేరును ప్రకటించగా.. టీఆర్​ఎస్​, బీజేపీ కూడా సోమవారం తమ క్యాండిడేట్లను ప్రకటించాయి. టీఆర్​ఎస్​ నుంచి నోముల భగత్​, బీజేపీ నుంచి డాక్టర్​ రవినాయక్​ బరిలో దిగనున్నారు.ఈ ఉప ఎన్నికలో పొలిటికల్ పార్టీలు కులాల లెక్కలు పక్కాగా చూసుకొని టికెట్లు ఇచ్చాయి. నియోజకవర్గంలో ఎక్కువ  ఓట్లు ఉన్న రెడ్డి, యాదవ, లంబాడా కమ్యూనిటీలకు ప్రయారిటీ ఇచ్చాయి. రెడ్డి కులానికి  కాంగ్రెస్ నుంచి, యాదవ కులానికి టీఆర్​ఎస్ నుంచి, లంబాడా కులానికి బీజేపీ నుంచి టికెట్లు దక్కాయి. బై పోల్ సందడి మొదలైనప్పటి నుంచి కుల సమీకరణలపైనే నియోజకవర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఖరారు కావడంతో కులం లెక్కలు ఎంత వరకు లాభం చేకూరుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

టీఆర్​ఎస్​ సర్వేలు చేయించి..!
సిట్టింగ్  ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్​లో ఏప్రిల్​ 17న ఉప ఎన్నిక జరుగనుంది. అయితే నర్సింహయ్య యాదవ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అదే కులానికి ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్​ఎస్​లో ఫస్ట్ నుంచి వినిపించింది. అదికూడా నోముల కుటుంబ సభ్యులకే ఇవ్వాలని పలువురు పట్టుబట్టారు. మరోవైపు నోముల నాన్​లోకల్​ కాబట్టి లోకల్స్​కే  చాన్స్​  ఇవ్వాలని రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మంత్రి జగదీశ్​రెడ్డి అనుచరుడు ఎంసీ కోటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్​కు ఎదురుదెబ్బ తగిలింది. పైగా దుబ్బాక ఉప ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో పార్టీ హైకమాండ్​కు సాగర్ ఉప ఎన్నిక  సవాల్ గా మారింది. టికెట్​ ఇవ్వడం వెనుక సిట్టింగ్​ అంశం కన్నా కులం లెక్కలను పరిగణనలోకి తీసుకుంది. దాదాపు రెండు, మూడు నెలల నుంచి వివిధ రకాల సర్వేలు చేయించింది. నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది..? ఏ కులానికి చెందిన లీడర్లకు ఓటర్ల మద్దతు  ఏ మేరకు ఉంది..? అనే కోణంలో  సర్వేలు జరిపించింది. చివరిసారిగా వచ్చిన సర్వే రిపోర్ట్​లో యాదవ కులానికే ఎక్కువ పర్సంటేజీ మద్దతు లభించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థి​ ఎవరనే విషయం వచ్చేసరికి నోముల భగత్, వటికూటి గురవయ్య పేర్లు తెరపైకి వచ్చాయి. యాదవ కులానికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్  డిసైడ్ అయినప్పటికీ అభ్యర్థి విషయంలోనే చివరవరకు సస్పెన్స్ కొనసాగించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో అభ్యర్థి ఎవరైనా సరే ఉప ఎన్నికలో  తమకు తిరుగుండదనే నమ్మకంతో భగత్ పేరును టీఆర్​ఎస్​ ఫైనల్​ చేసింది. 

ప్రత్యర్థుల వ్యూహాలకు దీటుగా బీజేపీ
దుబ్బాకలో మాదిరిగానే సాగర్​లోనూ సత్తా చాటుకునేందుకు బీజేపీ రెడీ అయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ కులానికి  ప్రయారిటీ ఇస్తాయో అంచనా వేశాక తమ అభ్యర్థిని డిసైడ్ చేయాలని చివరి వరకు సస్పెన్స్ కొనసాగించింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపినప్పటికీ మెజార్టీ ఓటు బ్యాంకు సాధించేందుకు బలమైన అభ్యర్థి కోసం  ప్రయత్నించింది. చివరకు లంబాడా కులానికి చెందిన రవి నాయక్ పేరును ఫైనల్  చేసింది. ఈ నియోజకవర్గంలో లంబాడా ఓటర్లు 34,027 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులానికి, టీఆర్ఎస్  యాదవ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందున తాము  లంబాడా కులానికి ప్రయారిటీ ఇస్తే మంచి ఫలితం దక్కుతుందని బీజేపీ అంచనా వేసింది. ఇప్పటికే గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యపై ఆ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారు. లంబాడా కమ్యూనిటీకి టికెట్ ఇవ్వడంతో టీఆర్​ఎస్​ వ్యతిరేక ఓటు తమకు పడుతుందని బీజేపీ నమ్ముతోంది. 

సాగర్​లో కులాల వారీగా ఓటర్ల వివరాలు

రెడ్డి    23,852
వెలమ     935
కమ్మ        3,020
బ్రాహ్మణ     304
వైశ్య    4,495
ముస్లిం    3,687
గౌడ్స్      12,065
యాదవ     36,646
మున్నూరు కాపు     8,018
పెరిక     2,287
చాకలి     6,309
మంగలి     1,986
కమ్మరి     3,312
వడ్డెర     2,708
పద్మ శాలి     921
కుమ్మరి     3,581
ముదిరాజ్     9,053
మాదిగ     25,838
మాల     7,983
లంబాడా     34,027
ఎరుకల     1,679
ఇతరులు    12,301