కులం బతికే ఉంది

కులం బతికే ఉంది

భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రెండు వందల ఏండ్లు వలస పాలన సాగింది. అంతకుముందు ఉన్న మొఘలుల పాలనకు, ఈ వలస పాలనకు చాలా తేడా ఉంది. మొఘలులు దేశ సంపదలో కొంత మొత్తాన్ని తమకు ఇష్టమొచ్చినట్టుగా దురుపయోగించారు. అయినా.. వాళ్లు మన దేశంలోనే స్థిరపడిపోయారు. కాబట్టి పెద్దగా నష్టం జరగలేదు. కానీ.. ఈ వలస వాదులు మాత్రం దేశంలో ఉండే సంపదను తమ ఆర్థిక అభివృద్ధి కోసం, తమ పరిశ్రమల కోసం వాడుకున్నారు. దాంతో పాటు ఎంతో సంపదను వాళ్ల దేశానికి తరలించారు. ఒకవేళ మనదేశం బ్రిటిష్‌‌ పాలనలో లేకపోతే.. బహుశా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండేదేమో. ఎందుకంటే మన దేశం అప్పట్లోనే ఉత్పత్తి రంగంలో చాలా ముందుండేది. వస్త్రాలు, వజ్రాలు లాంటి అనేక ఎగుమతులు చేసేది. అయితే.. దేశంలో అప్పటి పరిస్థితులు, మార్కెట్‌‌ని బట్టి చూస్తే.. పెట్టుబడిదారి వ్యవస్థే వచ్చేదేమో. సంపద వృద్ధి మాత్రం జరిగి, ఆసియాలో ఒక పెట్టుబడి దారి వ్యవస్థగా నిలిచేది. కానీ.. ఈ వలసవాదుల వల్ల అలాంటి ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయాం. అందుకే వాళ్లు చేసినటువంటి సంపద తరలింపుకు, వాళ్ల పాలనకు వ్యతిరేకంగా 1857లో తిరుగుబాటు జరిగింది. అది మన దేశ చరిత్రలో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా  గుర్తిస్తున్నాం. 

1857 వరకు మన మీద బ్రిటిష్‌‌ ఈస్ట్‌‌ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. ఒక కంపెనీ రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకోవడమనేది చరిత్రలో పెద్ద విషాదం. వ్యాపారం చేసుకునేవాళ్లు వ్యాపారం చేసుకోకుండా.. రాజ్యాధికారం ఉంటే ఎక్కువ సంపద కొల్లగొట్టొచ్చనే ఆలోచనతో అధికారం చేజిక్కుంచుకున్నారు. ఏదేమైనా.. మన దేశం1858లో డైరెక్ట్‌‌ బ్రిటిష్​ పాలనలోకి వచ్చింది. ప్రత్యేకంగా కలకత్తా, మద్రాసు, బాంబే లాంటి ప్రెసిడెన్సీలు మాత్రమే డైరెక్ట్ పాలనలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు సముద్రం ఒడ్డున ఉండటంతో వాళ్ల వ్యాపారానికి అనుకూలం కాబట్టి. అందుకే వీటిమీద ఎక్కువ పట్టు సాధించారు. మిగతా ప్రాంతాలు ప్రిన్స్‌‌లీ స్టేట్స్‌‌గా ఉన్నాయి. ఆ ప్రాంతాలు రాచరిక పాలనలో ఉండిపోయాయి.  ఈ ప్రాంతాలను బ్రిటిష్​ వాళ్లు నేరుగా పాలించకపోయినా.. వాళ్ల పరోక్ష పాలనలో ఉండేది. భారతీయ రాజులు పాలించేవాళ్లు. అధికారం రాజుల చేతిలోనే ఉన్నా బ్రిటిషర్లతో అనేక ఒడంబడికలు చేసుకోవడం వల్ల కీలుబొమ్మలుగా ఉండేవాళ్లు. ఇలాంటి ఒక సందర్భంలో స్వాతంత్ర్యోద్యమం మొదలైంది. 


స్వాతంత్ర్యోద్యమం భిన్న పాయలుగా జరిగింది. అయితే.. ఆదివాసుల విషయంలోకి వస్తే.... అడవుల్లోకి ఎప్పుడైతే ఈస్ట్‌‌ ఇండియా కంపెనీ వచ్చిందో అప్పటినుంచి ఆదివాసుల నుంచి ప్రతిఘటన మొదలైంది. దళితుల విషయానికొస్తే.. సమాజంలో  వాళ్ల పట్ల చాలా వివక్ష ఉండేది. ఆ వివక్షను అనుభవించిన డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ కులవ్యవస్థ నుంచి దళిత విముక్తి కొరకు పోరాటం చేశారు. అందుకోసం కొన్నిసార్లు ఆయన గాంధీని కూడా ప్రశ్నించారు. ఆయన ఎప్పుడూ ‘‘స్వాతంత్ర్యం వస్తే మా పరిస్థితి ఏంటి? నిజంగా దళితులకు స్వాతంత్ర్యం వస్తుందా?” అని ప్రశ్నించేవారు. అయితే.. కొందరు ఆయన కేవలం దళితుల స్వేచ్ఛ కోసమే పోరాడారు అనుకుంటారు. కానీ.. కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలన జరగాలని పోరాటం చేశారు. అప్పట్లో అంటరానితనం పెద్ద సమస్య కాబట్టి దానిపై ఎక్కువగా పోరాడారు. వాస్తవానికి అంటరానితనం అనేది మొత్తం కుల వ్యవస్థతో ముడిపడి ఉంది. కుల వ్యవస్థ పోతే దళితుల పరిస్థితి మారుతుందనేది ఆయన ప్రాపంచిక దృక్పథం. మహిళల గురించి కూడా ఆయన తన రచనల్లో విస్తృతంగా రాశారు.  ప్రత్యేకంగా ‘‘విప్లవం– ప్రతిఘాత విప్లవం”లో విశ్లేషించారు. ఇలా.. ఒక రకంగా గాంధీ, అంబేద్కర్‌‌‌‌, ఆదివాసీ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు మన స్వాతంత్ర్య పోరాట నేపథ్యం. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. రాజ్యాంగం  అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేసింది. కానీ.. కుల వ్యవస్థ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఆదివాసుల హక్కులకు రక్షణ కల్పించింది. ఏజెన్సీ ఏరియాలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని, ఆదివాసులకు అడవి, భూమి మీద హక్కులుంటాయని రాజ్యాంగం అంగీకరించింది. వాళ్ల పోరాటాల ఫలితంగానే ఇవన్నీ జరిగాయి. 

కుల వ్యవస్థ 
1947 నుంచి 67 వరకు ఒక రకమైన అభివృద్ధి జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్యను పెంచడం, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ పెంచడం లాంటివి జరిగాయి. కానీ.. గ్రామీణ వ్యవస్థలో ఉన్న సామాజిక సంబంధాల్లో మౌళిక మార్పు రాలేదు. పట్టణాల్లో పరిస్థితి కాస్త మారింది. గ్రామాల్లో ఆధిపత్య సంబంధాలు అలాగే కొనసాగాయి.  ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నా రావాల్సిన సామాజిక మార్పు రాలేదు. అయితే.. సమాజం మారాలి అనే ఆకాంక్ష మాత్రం అందరిలోనూ పెరిగింది. కానీ.. అది భిన్న రూపాల్లో వ్యక్తీకరించబడింది. అక్కడినుంచే అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాల వల్ల చైతన్యం పెరిగింది. కానీ.. ఆ చైతన్యం వల్ల కుల నిర్మూలన జరగడానికి బదులు కుల వ్యవస్థ బలపడింది. అన్ని కులాల్లో కుల స్పృహ పెరిగింది. సమాజం కులాల వారీగా వ్యవస్థీకృతం అయింది. దాంతో కులాలు తమకు రావాల్సిన వాటాల గురించి ప్రశ్నించడం మొదలైంది. ఏ కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్ ఆశించారో, స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ఆకాంక్షగా వచ్చిందో.. ఆ కుల వ్యవస్థ ఇంకా బలంగా మారింది. ఇలా తమ కులం కోసం కాకుండా మౌళిక సామాజిక మార్పు కొరకు ఉద్యమాలు జరిగితే సామాజిక మార్పు వేగంగా జరిగేది. ప్రతి కులం ‘‘మా వాటా ఏంటి?” అనడం వల్ల కుల వ్యవస్థ గతంలో లేనంత పటిష్టంగా మారింది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కానీ.. అందరి ప్రయోజనాల కోసం పోరాటాలు జరగడం లేదు. మన విధానాలు, పాలసీలు కులాన్ని సమీకరిస్తేనే ఓట్లు పడతాయనే కల్చర్‌‌ మొదలైంది. దాంతో కుల అస్తిత్వం పెరిగింది. అదే క్రమంలో మత అస్తిత్వం బలపడింది. అందువల్ల మత పరమైన విశ్వాసాలు విద్వేషాలుగా మారాయి. 1980 వచ్చే సరికి మనదేశంలో ఇందిరాగాంధీ రెండో టర్మ్‌‌లో ప్రపంచ బ్యాంకు దగ్గరినుంచి అప్పు తీసుకురావడం, వాళ్లు షరతులు పెట్టి ఇవ్వడంతో ఏ వలసవాదాన్ని మనం వ్యతిరేకించామో.. అదే వలస వాదం సామ్రాజ్యవాదం రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం బలపడింది. 

కుల పోరాటం 
ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కుల స్పృహ పెరగడం వల్ల సామాజిక వాదానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడే బదులు దళితులకు, బలమైన కులాలకు మధ్య ఘర్షణ పెరిగింది. ఇది సమాజం ముందుకు పోకుండా ఒక అడ్డుకట్టగా మారింది. ప్రతి కులం ‘‘మా పైన మీ ఆధిపత్యం ఏంటి? అని తమ పైన ఉండే కులాన్ని ప్రశ్నిస్తోంది. కానీ.. అలా ప్రశ్నించేవాళ్లే తమ కంటే బలహీనమైన కులాల పట్ల ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అంటే తనపై ఉన్న ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే.. తమ కంటే కింది స్థాయిలో ఉన్నవాళ్లపై ఆధిపత్యం కావాలంటున్నారు. ఈ రెండూ సమాంతరంగా జరుగుతున్నాయి. మహిళలు.. పురుషులను, దళితులు.. ఓబీసీలను, ఓబీసీలు.. బలమైన కులాలను ప్రశ్నించే తత్వం పెరిగింది. ఆ ప్రశ్నించే మనస్తత్వమే ఒక సామాజిక మార్పుగా గమనించాలి. 
సమజీవనం చేసే పరిస్థితి వస్తుందా? కులాల మధ్య ఉన్న ఆధిపత్య సంబంధాలు మారి, అందరూ కలిసి మానవీయంగా, ప్రజాస్వామ్యంగా సహజీవనం చేసేటటువంటి పరిస్థితి ఎలా వస్తుంది?  రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పిన సామాజిక నిర్మాణం ఎలా జరుగుతుంది? అని యావత్‌‌ భారతదేశం ఎదురుచూస్తోంది. నిజానికి ఇవాళ మన సంక్షోభం.. సామాజిక సంబంధాల సంక్షోభమే. ఇది లేకపోతే మన దేశం ఇంకా చాలా వేగంగా ముందుకుపోయేది.

అనేక లోపాలు
విద్యావిధానంలో అనేక లోపాలు ఉన్నాయి. సుమారు ముప్పై.. నలభై ఏండ్ల క్రితం వరకు కామన్‌‌ స్కూల్‌‌ విధానం ఉండేది. మా ఊళ్లో ఒకే స్కూల్‌‌ ఉండేది. అన్ని కులాల వాళ్లం అక్కడే కలిసి చదువుకునేవాళ్లం. కానీ.. తర్వాత కాలంలో వచ్చిన మార్పుల వల్ల కాలక్రమేణా కార్పొరేట్‌‌, ప్రైవేట్‌‌ స్కూళ్లు వచ్చాయి. దాంతో ఎవరి ఆదాయాలకు సరిపోయే స్కూళ్లను వాళ్లు ఎంచుకుంటున్నారు. లక్షల్లో ఖర్చు పెట్టేవాళ్ల కోసం ఒక రకమైన స్కూళ్లు, వేలల్లో ఇవ్వగలిగేవాళ్ల కోసం ఒకరకమైన స్కూళ్లు, ఏమీ ఇవ్వలేని వాళ్లకోసం ఒక రకమైన స్కూళ్లు ఉన్నాయి. దీనివల్ల కూడా సామాజిక సంబంధాల మార్పుకు అడ్డంకి ఏర్పడింది.  బలహీన పడుతున్నాయి. అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట చదువుకుంటే సామాజిక మార్పు వేగంగా సాధ్యమవుతుంది. అందుకే అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కామన్‌‌ విద్యా విధానమే అమల్లో ఉంది. అమెరికా, చైనా, జపాన్‌‌, స్కాండినేవియా దేశాల్లో చదువు అందరికీ సమానంగా అందుబాటులో ఉంది. 1964లో నియమించిన నేషనల్‌‌ ఎడ్యుకేషన్‌‌ కమిషన్‌‌(కొఠారీ కమిషన్‌‌)కు చైర్మన్‌‌గా ఉన్న కొఠారీ చెప్పిన మాటలను ఇక్కడ మనం ఒకసారి గుర్తుచేసుకోవాలి. ‘‘పేదవాళ్లు, సంపన్నులు ఒకే చోట చదువుకుంటే పేద వాళ్లకు సంపన్నుల మీద గౌరవం ఏర్పడవచ్చు. సంపన్నులకు పేదవాళ్ల మీద శ్రద్ధ, ఆసక్తి కలగవచ్చు” అన్నారు. దానివల్ల హెచ్చు–తగ్గులు తగ్గే అవకాశం ఉంటుంది. మన విద్యావిధానాన్ని మార్చి, కామన్ స్కూల్‌‌ విధానాన్ని తీసుకొస్తే.. సామాజిక మార్పు వేగంగా వస్తుంది. ప్రజాస్వామ్య సమాజం ఏర్పడే దారి పడుతుంది. ఒక మానవీయమైన సమాజ నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. మతాల మధ్య కూడా పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఈ 75 ఏండ్లలో దేశంలో సంపద బాగానే పెరిగింది. కానీ.. సంపద పెరగడం ఒక ఎత్తు. సామాజిక మార్పులు రావడం ఒక ఎత్తు. సంపద పెరుగుతూ.. సామాజిక మార్పు వస్తే ఆ సమాజాన్ని నిజంగా అభివృద్ధి చెందిన సమాజంగా చెప్పవచ్చు. 

ఇవాళ మనం ఈ ఆటుపోట్ల మధ్యే ఉన్నాం. కానీ.. ఇది సరైన దిశలో వెళ్లగలిగితే మరో 75 ఏండ్ల తర్వాత ఒక ప్రజాస్వామ్య, మానవీయ, సహజీవనంతో కూడిన ఒక సమాజం ఏర్పడే అవకాశం చరిత్రలో ఉంది. మనకుండే వనరులు,శక్తితో భారతదేశం ప్రపంచానికి ఒక మోడల్‌‌గా మారే అవకాశం ఉంది. గత 75 ఏండ్లలో వచ్చిన మార్పులను, అభివృద్ధిని హర్షిస్తూనే.. మన దేశాన్ని వెనక్కి లాగుతున్న శక్తులకు అడ్డంకులు వేయగలిగి సమాజాన్ని మార్చగలిగితే వచ్చే మరికొన్నేండ్లలో సామాజిక మార్పుతో కూడిన భారతదేశాన్ని సృష్టించుకోవచ్చు.
 

వ్యాసకర్త:  రిటైర్డ్‌ ప్రొఫెసర్‌‌‌‌, జి. హరగోపాల్‌‌, హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీ