కాంగ్రెస్​లో బీసీ లొల్లి.. ఈసారి బీసీలకు 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్​

కాంగ్రెస్​లో బీసీ లొల్లి.. ఈసారి బీసీలకు 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్​
  • సరైన ప్రాతినిధ్యం లేదంటున్న ఆ వర్గం నేతలు.. 
  • అగ్రకుల నేతలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు
  • పార్టీని ‘రెడ్డి కాంగ్రెస్​’లా మార్చేస్తున్నారని ఆరోపణలు
  • ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ ప్రకారమేకేటాయించాలని విజ్ఞప్తులు
  • ‘టీం ఓబీసీ’ పేరిట కాంగ్రెస్​ నేతల గ్రూపు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీలో కులపోరు మరోసారి చర్చనీయాంశమవుతున్నది. పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతున్నదని ఆ వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో కూడా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. సమన్యాయం పాటించకుండా కేవలం అగ్రకులాల వారినే అందలం ఎక్కిస్తున్నారని, పార్టీని ‘రెడ్డి కాంగ్రెస్​’లా మార్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు బీసీ నేతలు రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

జనరల్​ సీట్లలోనూ కేటాయింపులు చేయాలన్న డిమాండ్​ను లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా.. ‘టీం ఓబీసీ’ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేశారు. బీసీలకు ఎక్కువ టికెట్లను సాధించేందుకు ఆ గ్రూపులోని నేతలు సమావేశమయ్యారు.  

జనరల్​ స్థానాల్లోనూ అవకాశం ఇవ్వాల్సిందే..

తమకు కేవలం రిజర్వేషన్​లోనే బీసీలకు టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతున్నదన్న వాదనను బీసీ నేతలు వినిపిస్తున్నారు. అందుకే ఈ సారి జనరల్​ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇచ్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఒక్కో లోక్​సభ స్థానం పరిధిలో మూడు సీట్లకు తగ్గకుండా డిమాండ్​ చేస్తున్నారు. కనీసం 40 సీట్ల కంటే ఎక్కువ కేటాయించాలని తేల్చి చెప్తున్నారు. పార్టీలో పెద్ద కులాల వారి పెత్తనం వల్ల బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదని, ఎనిమిదేండ్లుగా పార్టీ దిగజారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్​ కేటగిరీని పెద్ద కులాలకు ‘అనధికారిక రిజర్వ్​డ్​ కేటగిరీ’గా మార్చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లే కర్నాటకలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగలిగిందని అంటున్నారు. ఇటు కొందరు ఎస్టీ సామాజికవర్గం నేతలు కూడా జనరల్​ సీట్లలో పోటీకి సిద్ధమవుతుండడం గమనార్హం. తొలుత జనరల్​ కేటగిరీ సీటునే పార్టీ నాయకత్వాన్ని అడుగుతామని ఓ ఎస్టీ సామాజికవర్గం నేత తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో గెలుపుపై ఏఐసీసీ ఫోకస్​​

రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఏఐసీసీ సీరియస్​గా కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీలో ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తున్నది. దాంతో పాటు నేతలందరూ పార్టీ లైన్​లోనే పని చేయాలంటూ సీనియర్లకు గట్టిగానే చెప్పింది.

ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ను  పాటించాల్సిందే

వచ్చే ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ను పాటించాల్సిందేనని బీసీ నేతలు తేల్చి చెప్తున్నారు. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అణగారిన వర్గాల వారికి సమాన ప్రాధాన్యం కల్పించాలని నిరుడు మేలో జరిగిన చింతన్​ శిబిర్​లో కాంగ్రెస్​ పార్టీ తీర్మానించింది. ‘వన్​ ఫ్యామిలీ.. వన్​ టికెట్’​ఫార్ములానూ ఆమోదించింది. కుటుంబంలో మరో నేత యాక్టివ్​గా ఉన్నా.. ఐదేండ్ల తర్వాతే టికెట్​ ఇవ్వాలని డిక్లరేషన్​లో పొందుపరిచింది. ఈ డిక్లరేషన్​ను ఫాలో కావాలని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్​ పార్టీ ‘బీసీ డిక్లరేషన్​’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​లను ఆహ్వానించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీసీ లీడర్ల డిమాండ్​ ప్రాధాన్యం సంతరించుకున్నది. 

పెద్ద కులాల నేతల నుంచి సపోర్ట్​​ కరువు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల్లో బీసీలకు పార్టీ సీట్లను కేటాయించినా గెలిపించుకోలేకపోయారని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం పార్టీలోని పెద్ద కులాల నేతలేనని ఆరోపిస్తున్నారు. వారి నుంచి బీసీ లీడర్లకు సరైన సహకారం లేకపోవడం వల్లే ఆ స్థానాల్లో ఓడిపోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అగ్రకులాల నేతలు.. బీసీ క్యాండిడేట్లకు మద్దతు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేలకు వినతి పత్రం ఇవ్వాలని డిసైడ్​ అయ్యారు.