సిసోడియాపై సీబీఐ కేసు.. ఫీడ్ బ్యాక్ స్కాం

సిసోడియాపై సీబీఐ కేసు.. ఫీడ్ బ్యాక్ స్కాం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై మరోకేసు నమోదైంది.  ఢిల్లీ ఫీడ్ బ్యాక్  యూనిట్ కేసులో సీబీఐ ప్రస్తుతం జైల్లో ఉన్న మనీష్ సిసోడియాపై  ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియాతో సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. అవినీతిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ (FBU) "పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లా పనిచేసిందని CBI ప్రాథమిక విచారణలో గుర్తించింది.

2015లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని, అయితే దీనిపై ఈ  సర్క్యులేట్ కూడా విడుదల కాలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది. ఎఫ్‌బీయూలో నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. "ఫీడ్‌బ్యాక్ యూనిట్  తప్పనిసరి సమాచారం సేకరించడంతో పాటు, రాజకీయ నిఘా,  ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికలో స్పష్టం చేసింది. ఎఫ్‌బీయూలో అవకతవకలను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం సూచన మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ చేసి..మనీష్ సిసోడియా సహ ఏడుగురిపై కేసు నమోదు చేసింది.

సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఏడుగురిపై  నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ప్రభుత్వోద్యోగి ద్వారా విశ్వాస ఉల్లంఘన, ఫోర్జరీ,  నకిలీ డాక్యుమెంట్లను నిజమైన పత్రాలుగా ఉపయోగించడం, ఖాతాలను తప్పుగా మార్చడం వంటి అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా -, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ (ఎఫ్‌బీయూ)పై కేసు నమోదైంది. 

ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ అంటే ఏమిటి? 

ఢిల్లీ మంత్రివర్గం ఆమోదంతో సెప్టెంబర్ 2015లో  'ఫీడ్ బ్యాక్ యూనిట్' ఏర్పాటైంది.  ఢిల్లీ ప్రభుత్వ అధికార పరిధిలోని ప్రభుత్వ శాఖలు, స్వయంప్రతిపత్త సంస్థలు, సంస్థలు, సంస్థల పనికి సంబంధించి  సమాచారంతో పాటు.. చర్యలు తీసుకోదగిన అంశాలపై అభిప్రాయాన్ని ఈ యూనిట్ సేకరిస్తుంది.  విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో  ఫీడ్ బ్యాక్ యూనిట్ సిబ్బంది  ప్రభుత్వ లక్ష్యాలు, - ప్రధానంగా వ్యక్తులపై నిఘా పెట్టడం, ట్రాప్ కేసులు వంటి వాటిపై స్టింగ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తుంది. ఇది ముఖ్యమంత్రి  ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది. FBUలో  ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, పోలీసు సంస్థలకు చెందిన రిటైర్డ్ అధికారులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 17 మంది కాంట్రాక్టు ఉద్యోగులతో యూనిట్ మొదలైంది. ఇందు కోసం 2016-17 బడ్జెట్ లో  ఢిల్లీ ప్రభుత్వం రూ. 1 కోటి  కేటాయించింది. 

ఫిర్యాదుతో బండారం బయటపడింది..

2016లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ అధికారి ఫిర్యాదుతో  రంగంలోకి దిగిన  సీబీఐ విచారణ జరిపింది. ఈ  ప్రాథమిక విచారణలో  రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ సంస్థలు, AAP యొక్క రాజకీయ ప్రయోజనాలపై ఫీడ్ బ్యాక్ యూనిట్ పనిచేసినట్లు తేలింది. అయితే ఇది ఇప్పటికీ ఉనికిలో ఉందా  రద్దు చేయబడిందా అనే దానిపై స్పష్టత లేదు. కానీ CBI మాత్రం తన నివేదికలో FBU 700 కంటే ఎక్కువ కేసులను దర్యాప్తు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఫీడ్ బ్యాక్ యూనిట్ తన విధుల్లో భాగంగా  60 శాతం రాజకీయ గూఢచారంపైనే పనిచేసినట్లు సీబీఐ తన నివేదికలో వెల్లడించింది. 

లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆరోపణ...

ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ పై ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా  లేఖ రాశారు. ఇది ఒక ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తరహాలో “ఎక్స్‌ట్రా -కాన్‌స్టిట్యూషనల్ లేదా ఎక్స్‌ట్రా-జ్యుడిషియల్ బాడీ” అని ఆరోపించారు. ఇది ఎటువంటి శాసన, న్యాయ లేదా కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా 'స్నూపింగ్, అతిక్రమణ' యొక్క అధిక అధికారాలను కలిగి ఉన్న " సమాంతర రహస్య ఏజెన్సీ" అని పేర్కొన్నారు.