
హైదరాబాద్, వెలుగు: యూరో ఎక్సిమ్ బ్యాంకు స్కామ్ దేశంలోనే పెద్దదని, దీంట్లో ఎంతో మంది బడా కాంట్రాక్టర్ల ప్రమేయం ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ ఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బ్యాంక్ గ్యారంటీలో భాగంగా రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దేశ చట్టాలకు ఎలాంటి సంబంధం లేని యూరో ఎక్సిమ్ బ్యాంక్ సెయింట్ లూసియా అనే చిన్న దీవిలో ఉందని ఆయన వెల్లడించారు. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ అని తెలిపారు. ఆ బ్యాంకు ఇచ్చే గ్యారంటీ మన దేశంలో చెల్లదని, అయినా ఏజెన్సీలు దీన్ని అనుమతించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు.