సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. 21 చోట్ల రైడ్స్​

 సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. 21 చోట్ల రైడ్స్​

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సీబీఐ సోదాలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీశ్ సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్ గోపి కృష్ణ ఇళ్లలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. మా ఇంటికి సీబీఐ వచ్చిందంటూ మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. లక్షల మంది పిల్లలకు భవిష్యత్ ను నిర్మించేందుకు తాము నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో మంచిపని చేసే వారిని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని కేంద్రాన్ని విమర్శించారు. అందుకే మన దేశం ఇప్పటికీ నెంబర్ వన్ గా లేదని ఆయన అన్నారు. 

అటు సీబీఐకి స్వాగతం అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు  తాము పూర్తిగా సీబీఐకి సహకరిస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఢిల్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మోడల్ పై చర్చ జరుగుతుందని, దీన్ని ఆపాలనే కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ఢిల్లీ హెల్త్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారన్నారు. 75ఏళ్లలో ఎవరు మంచిపని చేసినా ఏధో విధంగా అడ్డుకున్నారని.. అందుకే దేశం ఇప్పటికీ వెనకబడి ఉందని కేజ్రీవాల్ అన్నారు.  ఎవరేం చేసినా.. తాము చేసే మంచి పనులు ఆపలేరని  ఢిల్లీ సీఎం పేర్కొన్నారు.