వామనరావు దంపతుల హత్య కేసులో కీలక అప్డేట్.. సీబీఐ కేసు నమోదు

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక అప్డేట్.. సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్: లాయర్లు వామనరావు దంపతుల హత్య కేసులో కీలక అప్డేట్.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. సెక్షన్లు120బి, 341, 302, 34 కింద సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఎఫ్ఐఆర్ లో నిందితులు వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ల పేర్లను చేర్చింది. 

గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని ఆగస్టు 12న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.

హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన భార్య నాగమణిని పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పండతో కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టిన సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది.