
క్రీ.పూ.6వ శతాబ్ధంలో ఆవిర్భవించిన మతాలలో బౌద్ధం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మతం కాదు, జీవన విధానం. ఇంకా చెప్పాలంటే ఇది సంస్కరణ వాదం అని చెప్పవచ్చు. భారతదేశంలో మానవత్వాన్ని ప్రబోధించి, సమానత్వాన్ని చాటిన బౌద్ధానికి ఆద్యుడు సిద్ధార్థుడుగా పిలవబడుతున్న గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు. క్రీ.పూ. 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వద్ద జన్మించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. సిద్ధార్థుడు పుట్టిన తరువాత తల్లి మరణించడంతో సవతి తల్లి ప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. అందుకే అతడిని గౌతముడు అంటారు.
ఒక రోజు బుద్ధుడు దారిలో ప్రయాణిస్తుండగా ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూసి అంతర్మథనం చెందాడు. అనంతరం అతడికి దేహం అశాశ్వతమని, ప్రాపంచిక సుఖాలను వదిలి తన 29వ ఏట మహాభినిష్ర్కమణం చేశాడు. గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందేవరకు తపస్సు చేశాడు. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధపౌర్ణమి గుర్తింపుపొందింది. ప్రతి ఏటా ఆ రోజు బౌద్ధులు బుద్ధుని బోధనలు చదవుతారు. ఈ సంవత్సరం మే 12న బుద్ధ పౌర్ణమి జరగనుంది. వైదిక మతంలోని అణచివేత నుంచీ దళిత, పీడిత, అట్టడుగు వర్గాలను విముక్తి చేశాడు. సంస్కరణాత్మక దృక్పథంతో కొత్త మార్గాన్ని చూపాడు.
బుద్ధుని ఉపదేశంలో గొప్ప సత్యాలున్నాయి. అవి.. లోకం దుఃఖమయం, దుఃఖానికి మూలం కోరిక, కోరికను నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా కోరికలను నివారించవచ్చన్నాడు. అష్టాంగ మార్గంలో సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన సాధన, సరైన స్మృతి, సరైన ధ్యానం వంటి ఎనిమిది శాస్త్రీయ పరిష్కారాలు చూపాడు. వీటిని చక్కగా ఆచరించడం ద్వారా ప్రశాంతత, శాంతి లభిస్తుంది. ఇవీ నేటి సమాజంలో కూడా ఆచరణీయమైనవి. మానవ విలువలు కలిగిన బౌద్ధం.. అశోకుడు వంటి గొప్ప రాజుల ఆదరణకు నోచుకొన్నది. దీంతో సామాన్య జనులకు దగ్గరైంది. బుద్ధుడు సరళమైన తాత్వికత, ఆచరణాత్మక విధానాలు భారతదేశంతోపాటు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి.
బౌద్ధం అనుసరణీయం
బౌద్ధం ముఖ్యంగా మతరంగాన్ని విప్లవీకరించింది. కర్మకాండలు, మూఢ నమ్మకాలు, జంతుబలులతో భ్రష్టుబట్టిన మతాన్ని సంస్కరించి నైతికతను, మానవీయ విలువలను జోడించింది. అంతేకాకుండా భారతదేశంలో ఆనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షల నుంచీ సమాజానికి విముక్తి కలిగించింది. బౌద్ధం భారతీయ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది. సామాన్య ప్రజలకు చేరువయ్యే క్రమంలో పాళీ వంటి ప్రజల భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించింది. బౌద్ధం గొప్ప వాస్తు శిల్పకళలను ప్రోత్సహించింది. బౌద్ధం సామాన్య ప్రజల విశ్వాసాలను ఆచారాలను తనలో కలుపుకుంటూ సాంస్కృతిక సమైక్యతకు దోహదం చేసింది. ఇప్పుడు భారతదేశం బోధిస్తున్న వసుధైక కుటుంబానికి నాంది పలికింది.
బౌద్ధం వర్ణ వ్యవస్థలోని కాఠిన్యాన్ని తగ్గించి దళిత, పీడిత వర్గాల పరిస్థితి మెరుగయ్యేందుకు దోహదపడింది. అందువల్లనే ఆధునిక యుగంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ 5 లక్షల మందితో విజయదశమి రోజున అక్టోబర్ 14న నాగ్పూర్ లో బౌద్ధాన్ని స్వీకరించాడు. బౌద్ధాన్ని అస్పృశ్యవర్గాలకు ఒక విమోచన సాధనంగా భావించాడు. నేడు దళిత ఉద్యమ భావనల్లో, సాహిత్యంలో బౌద్ధం ఒక విడదీయరాని భాగంగా మారి తమ హక్కుల పోరాటాలకు ఊపిరి ఊదింది. ప్రశ్నించే తత్వాన్ని బోధించింది. ఇప్పటికీ ప్రతి అంబేద్కర్ వాదికి బౌద్ధం దగ్గరైనా...ఆచరణలో దూరమైనది. నేడు కులతత్వం, మతతత్వం పెరిగిపోతున్న భారతదేశంలో బౌద్ధ జీవన విధానం అనుసరణీయం. బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది.
మనో వికాస నిపుణుడు బుద్ధుడు
గౌతమ బుద్ధుడు అనగానే అందరికీ ప్రశాంతమైన ముఖం కళ్ల ముందు కనబడుతుంది. అందుకే మానసిక నిపుణులు సైతం ఇంట్లో గౌతమ బుద్ధుని ఫొటో పెట్టుకోవాలని చెబుతుంటారు. నేటికి కులం, మత, ధర్మాలతో కొట్టుమిట్టాడుతున్న భారత్కు బుద్ధుని ప్రవచనాలు అవసరం. ఇది మతంగా చూడకుండా జీవనవిధానంగా చూడాలి. ఇక బుద్ధుడు చెప్పిన ప్రతిమాట ఇప్పటికీ మన జీవితాలను నడిపించే ఒక పాఠంగా మారింది. ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఆనాడే చెప్పాడు. కావున మనుషులపై ఈర్ష్య, ద్వేషం వీడాలి. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అనే మాటకు చోటే ఉండదు.
ఈ అంతః సూత్రం తెలియక కోట్లాది ప్రజల సమస్యలతో సతమతమౌతున్నారు. అంగీకరించడం, వదిలిపెట్టడం అనే వాటిని అలవాటుగా మార్చుకోన్నప్పుడే ముందుకుపోతామని బుద్ధుడి సూక్తులు చెబుతున్నాయి. ఆయన బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయ కలిగి ఉండడం. ఇలాంటివారు ఎదుటివారిని ఇబ్బంది పెట్టరు తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు. తమ విముక్తికి ధర్మబద్ధ పొరాటం చేయాలని పిలుపునిచ్చాడు. అహంకారం మనిషిని పతనానికి కారణమని బుద్ధుడు తెలిపాడు. అహాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్లు చెబుతారు.
భౌతిక సుఖాలపై వ్యామోహాలను వీడిన రోజే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందనే తాత్వికతను బుద్ధుడు తెలిపాడు. ఇలా ప్రకృతిలోని సైన్స్ ను చాలా చక్కగా చెప్పాడు. కావున బుద్ధి జీవిగా మారాలంటే బుద్దుని బోధనలు తెలుసుకోవాల్సిందే, ఆచరించాల్సిందే.
సంపతి రమేష్ మహారాజ్, సోషల్ ఎనలిస్ట్