
- మహిళల ఉచిత ప్రయాణ విలువ రూ.6,700 కోట్లు
- అధికారులు, సిబ్బందికి మంత్రి పొన్నం పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలుచేసిన మహాలక్ష్మి పథకం విజయపథంలో నడుస్తోంది. 2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళలు 200 కోట్ల ఫ్రీ టికెట్స్పొందారని, వాటి విలువ రూ.6,700 కోట్లు అని మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మహిళలు చాలా డబ్బులు ఆదా చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తోందని తెలిపారు. ఆర్టీసీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఇతర సిబ్బంది, అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు
ఆర్టీసీలో 200 కోట్ల ఫ్రీ టిక్కెట్ల మహిళల జర్నీని పురస్కరించుకొని బుధవారం డిపోలు, బస్టాండ్లలో సంబురాలు చేసుకోవాలని మంత్రి పొన్నం ఆ సంస్థ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లలో బ్యానర్లు ప్రదర్శించి సంబురాలు చేసుకోవాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బస్ స్టేషన్లలో నిర్వహించే సంబురాలకు స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. మహిళా ప్రయాణికులతో ప్రసంగాలు చేయించాలన్నారు.
డిపోలు, బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతితో సత్కరించాలన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై స్కూళ్లు, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని.. ఐదుగురు విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు మొదలైన బహుమతులు ఇవ్వాలన్నారు. అలాగే, ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని ఐదుగురు ఉత్తమ డ్రైవర్లు, ఐదుగురు ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్‌లు, భద్రతా సిబ్బందిని కూడా సత్కరించాలని మంత్రి ఆదేశించారు.