వ్యాక్సిన్ కోసం రూ.1,732 కోట్లు అడ్వాన్సు

వ్యాక్సిన్ కోసం రూ.1,732 కోట్లు అడ్వాన్సు
  • అడ్వాన్స్​ అందిందని ధృవీకరించిన సీరమ్ ఇన్​స్టిట్యూట్​
  • రాబోయే నెలల్లో 11 కోట్ల డోసులు ఇస్తాం:  సీరమ్​ సీఈఓ అదర్ పూణావాలా

న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి  తమ కంపెనీకి 26 కోట్ల డోసుల సప్లై కోసం ఆర్డర్లు వచ్చాయని, ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,732.5 కోట్ల అడ్వాన్సు కూడా చెల్లించిందని సీరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూణావాలా వెల్లడించారు. రాబోయే నెలల్లో ప్రభుత్వానికి 11 కోట్ల డోసులు, ప్రైవేటు ఆస్పత్రులకు, రాష్ట్రాలకు 11 కోట్ల డోసులు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అడ్వాన్స్​లు చెల్లించలేదనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​లు ఈ క్లారిఫికేషన్​ ఇచ్చాయి. భారత్​ బయోటెక్​కు కూడా కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్​ ఇచ్చింది. వీలైనంత త్వరలో వ్యాక్సిన్​ ప్రొడక్షన్​ పెరిగేలా ప్రభుత్వం, కంపెనీలు చొరవ తీసుకుంటున్నాయి.
రాత్రికి రాత్రే సాధ్యం కాదు...
కాకపోతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్​ను ఒకేసారిగా ఎక్కువగా పెంచడం సాధ్యం కాదని  పూణావాలా చెప్పారు. ఇండియా జనాభా చాలా పెద్దదని, ఇంత మందికి వ్యాక్సిన్ తయారు చేయడం సులువైన పని కాదని అన్నారు. సెకండ్​వేవ్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నందున, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పేర్కొన్నారు.  ‘‘వ్యాక్సిన్ గురించి నేను ఇటీవల చేసిన కామెంట్స్‌‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వ్యాక్సిన్ తయారీ స్పైషలైజ్డ్ ప్రాసెస్. రాత్రికే రాత్రే ప్రొడక్షన్‌‌ను పెంచడం కుదరదు. ఇండియా జనాభా చాలా ఎక్కువ. ఇంత మందికి తక్కువకాలంలో వ్యాక్సిన్ అందించడం సాధ్యపడదు. తక్కువ జనాభా కలిగిన ధనిక దేశాలకు కూడా తగినన్ని వ్యాక్సిన్లు అందడం లేదు. అక్కడి కంపెనీలు కూడా ప్రొడక్షన్ కెపాసిటీని పెంచలేకపోతున్నాయి”అని ఆయన ట్వీట్ చేశారు. ప్రొడక్షన్ పెంపు గురించి గత ఏడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నామని చెప్పారు. సైంటిఫిక్, రెగ్యులేటరీ, ఫైనాన్షియల్ వంటి అంశాల్లో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పారు ‘‘వ్యాక్సిన్ త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. మేం కూడా ఎక్కువ డోసులు తయారు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం” అని పూణావాలా కామెంట్ చేశారు.

ఇంగ్లండ్‌‌లోనూ తయారీ..

మరిన్నిడోసులను అందుబాటులోకి తేవడానికి ఇండియా బయట కూడా ప్రొడక్షన్​ మొదలుపెట్టాలని ఎస్ఐఐ భావిస్తోంది. ముడి పదార్థాల సరఫరాలో సమస్యల కారణంగా లోకల్​గా ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవడమే ఇందుకు కారణమని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.  ఇంగ్లండ్‌‌లో వ్యాక్సిన్​ తయారు చేసే ప్రపోజల్‌‌ను పరిశీలిస్తున్నామని పూణావాలా ఇటీవల చెప్పారు. వ్యాక్సిన్​ను త్వరగా సప్లై చేయాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో ప్రభుత్వం పూణావాలాకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది.  బెదిరింపులు, ఒత్తిళ్ల వల్లే తన కుటుంబంతో సహా లండన్‌‌‌‌‌‌‌‌కు వచ్చేశానని చెప్పారు. ఇదిలా ఉంటే, ఎస్ఐఐ గత వారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌‌‌‌‌‌‌‌ ధరను రాష్ట్రాలకు  రూ. 400 నుంచి రూ. 300 లకు  తగ్గించింది. కేంద్రానికి డోసు రూ. 150 కే ఇస్తూ, రాష్ట్రాలకు రూ. 400 అమ్మడంపై  విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.