‘బనకచర్ల’పై విజయం కాంగ్రెస్ సర్కారుదే..మా పోరాటం వల్లే ఏపీ ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపింది: మంత్రి ఉత్తమ్

‘బనకచర్ల’పై విజయం కాంగ్రెస్ సర్కారుదే..మా పోరాటం వల్లే ఏపీ ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపింది: మంత్రి ఉత్తమ్
  • గోదావరి ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధమని కేంద్రానికి ఫిర్యాదు
  • కృష్ణా, గోదావరి జలాల్లో తీరని అన్యాయం చేసింది గత బీఆర్ఎస్సే​
  • ఏపీకి నీళ్లను రాసిచ్చింది కేసీఆరే.. 
  • 2018లోనే ఏపీ సర్కారు మూడు జీవోలు ఇచ్చిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది గత బీఆర్ఎస్​ సర్కారేనని, నీళ్లను ఏపీకి రాసిచ్చారని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. వాళ్లు తీరని అన్యాయం చేస్తే.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీళ్లపై ట్రిబ్యునల్​లో కాంగ్రెస్ సర్కారు పోరాడుతున్నదని చెప్పారు. రాయలసీమకు గోదావరి నదీ జలాల తరలింపు కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలోనే మొదలైందని.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్​, తాను చేసిన కృషి ఫలితంగానే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను ఏపీకి కేంద్రం తిప్పి పంపిందని తెలిపారు. ఇది కాంగ్రెస్​ సర్కా రు సాధించిన విజయమని చెప్పారు. గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్–1985 అవార్డుకు బనకచర్ల ప్రాజెక్టు విరుద్ధమని తమ ప్రభుత్వం వాదించిందని, ఆ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించిందని వెల్లడించారు. కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్​ సర్కారువల్లే ఏపీ ఆ ప్రాజెక్టు చేపడుతున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్​ నేతలు ఆరోపించడం అర్థరహితమన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు వల్లే​ కృష్ణా, గోదావరి జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్​ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. 

2016లోనే  ప్రతిపాదన

గోదావరి–పెన్నా నదుల అనుసంధానం 2016లో కేసీ ఆర్​ హయాంలోనే జరిగిందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ఇరిగేషన్​ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, ఆ రాష్ట్ర అధికా రులు, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు, అధికారులు.. ఆనాటి అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడే 2018 మార్చి 29, 2018 జూన్​ 13, 2018 సెప్టెంబర్​ 5న గోదావరి–పెన్నా నదుల అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని  గుర్తు చేశారు.

గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్​కు మళ్లించేందుకు 2019 జూన్​ 28, ఆగస్టు 2, సెప్టెంబర్​ 23న ఆనాటి ఏపీ సీఎం జగన్​తో కేసీఆర్​ సమావేశమయ్యారని చెప్పారు. బనకచర్ల లింక్​కు మార్గం సుగమం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. నదుల అనుసంధానానికి పట్టిసీమ ప్రాజెక్టును నమూనాగా తీసుకున్నారని తెలిపారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి చంద్రబాబు సమర్పించారని, రాష్ట్రాల అభిప్రాయాలను కోరితే.. తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొన్నారు. 

మన పర్మిషన్​ లేకుండానే..

విభజన చట్టం 2014 ప్రకారం.. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా ఏదైనా ప్రాజెక్టును చేపట్టాలంటే రెండు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని మంత్రి ఉత్తమ్​ తెలిపా రు. కానీ, ఆ నిబంధనను ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. పోలవరం ఇరిగేషన్​ ప్రాజెక్టుకు తమ అభ్యంతరాలేమీ లేవని.. కానీ, దాని ద్వారా అదనంగా తీసుకునే నీటిపై తీవ్రమైన అభ్యంతరాలున్నాయని తెలి పారు.

పోలవరం–బనకచర్ల లింక్​ ప్రాజెక్టు ప్రతిపాదనపై ఎమర్జెన్సీ మీటింగ్​ను ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీని కోరామన్నారు. గోదావరి నదీ జలాల వివాద చట్టానికి పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విరుద్ధమని కేంద్రానికి స్పష్టంగా ఫిర్యాదు చేశామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక సాయం చేయొద్దని తాము కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి గుర్తుచేశారు.

10 అంశాలపై పవర్​ పాయింట్ ​ప్రజెంటేషన్​

బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ ద్వారా ఇటు కృష్ణా, అటు గోదావరి నీళ్లను తరలించుకుపోయేలా ఏపీ ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటు శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​ కెపాసిటీని పెంచి రోజూ 9 టీఎంసీలు తరలించడంతోపాటు.. పోలవరం-బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​ ద్వారా మరో 3 టీఎంసీల తరలింపు నకు కుట్రలు చేస్తున్నదని తెలిపింది. మంగళవా రం ప్రజాభవన్​లో  ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో బనకచర్ల ప్రాజెక్ట్​పై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​​ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్​ చైర్మన్లకు అవగాహన కల్పించారు. 10 అంశాల ను క్షుణ్నంగా వివరించారు.