
సెప్టెంబర్ 17 వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం నుంచే వేడుకలు మొదలుకాగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సంబురాలు షురూ కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా చేపడుతున్న ఈ సెలబ్రేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం పరేడ్ గ్రౌండ్లో జరిగే విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. అదే రోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనున్న సమైక్యతా ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఎక్కడ కూడా విమోచనం, విలీనం అనే పదాలు వినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సీఎం సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది.
నియోజకవర్గానికి 30 లక్షలు
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. తొలిసారి సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నది. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలకు ప్రతి నియోజకవర్గానికి రూ. 30 లక్షల చొప్పున విడుదల చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో స్టూడెంట్లు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదే రోజు హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రతిచోట ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ అనేది తప్ప విమోచనం, విలీనం వంటి పదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రజాస్వామిక పాలనలోకి తెలంగాణ ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి 18 వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే హైలెట్ అయ్యే విధంగా టీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకలకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఇట్లా..!
సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు...సెప్టెంబర్ 17: హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనం, సేవాలాల్ బంజార ఆత్మగౌరవ భవనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆదివాసీ, గిరిజన కళారూపాలతో భారీ ఊరేగింపు. మధ్యాహ్నం ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో సీఎం సభ. సెప్టెంబర్ 18: జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు, కవులకు, కళాకారులకు సన్మానాలు. సాంస్కృతిక కార్యక్రమాలు.