రాష్ట్రాలకు చెల్లింపుల్లో కేంద్రం వివక్ష : ఎంపీ నామా నాగేశ్వరరావు

రాష్ట్రాలకు చెల్లింపుల్లో కేంద్రం వివక్ష : ఎంపీ నామా నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: దేశవ్యాప్తంగా కేంద్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి  రూ.30,48,044 కోట్ల  ఆదాయం లభిస్తోందని, కానీ రాష్ట్రాల వాటా మేరకు తెలంగాణాకు చెల్లింపులు చేయకుండా కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్​లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిధులపై ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లభిస్తున్న ఆదాయం, తిరిగి చెల్లింపులకు సంబంధించిన సమగ్ర వివరాలను సభలో వెల్లడించాలని ఎంపీ నామా కేంద్రాన్ని కోరారు.  

కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో  రూ.30 లక్షల కోట్ల రాబడి సమకూరగా, అందులో రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం రూ.8,82, 903.79 కోట్లు మాత్రమేనని, మిగతా సొమ్ము ఏమైందని ప్రశ్నించారు. దాదాపు రూ. 22 లక్షల కోట్లు కేంద్రం తన వద్ద ఉంచుకొని, రాష్ట్రాలకు భిక్ష వేసినట్లు చేతులు విదిలిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి 2021-–- 22 ఆర్థిక సంవత్సరంలో 18,720.54 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారని, కానీ రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేశారో చెప్పమంటే మాత్రం తమవద్ద అందుకు సంబంధించిన డేటా లేదనడం సమంజసంగా లేదన్నారు. కేంద్రం వివక్ష వీడి, తెలంగాణకు రావాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.