అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌‌‌‌లోనే నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం

అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌‌‌‌లోనే నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం
  • అక్టోబర్ రెండో వారంలోగా షెడ్యూల్
  • ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పట్లో జమిలి ఉండకపోవచ్చని
  • పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌‌తో క్లారిటీ
  • అన్ని పార్టీల్లో మొదలైన హడావుడి.. ప్రచారంలోకి దిగాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రుల ఫోన్లు
  • అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
  • ఒకట్రెండు రోజుల్లో బీజేపీ ఫస్ట్ లిస్ట్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌‌‌‌లోనే నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నది. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలోనే ఎలక్షన్ షెడ్యూలు విడుదల చేసే సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే నవంబర్ చివరి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. జమిలి ప్రచారం తేలిపోవటం, ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలేవీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లేకపోవటంతో రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహణపై అనుమానాలన్నీ తొలగిపోయాయి. లోక్‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగానే నిర్ణీత సమయానికే జరుగుతాయని వెల్లడైంది. దీంతో మొన్నటి వరకు వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్న పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. బుధవారం ఉదయం నుంచే అన్ని పార్టీల్లో హడావుడి మొదలైంది.

స్పీడందుకున్న బీఆర్ఎస్

ఇప్పటికే అభ్యర్థులను అనౌన్స్ చేసిన అధికార బీఆర్ఎస్.. దాదాపు నెల రోజులు సైలెంట్‌‌‌‌గా ఉండిపోయింది. ప్రచారానికి తొందరపడవద్దంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సూచించింది. ఢిల్లీలో జరిగే పరిణామాలపైనే ఎక్కువ ఆసక్తి చూపింది. తాజాగా ఎన్నికలకు రూట్ క్లియరవటంతో ఒక్కసారిగా గేర్​ మార్చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌‌‌‌​రావు ఉదయాన్నే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు ఫోన్లు చేసి మాట్లాడారు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రచారం చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలని అందరినీ అలర్ట్ చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ కసరత్తు

ఎన్నికల కోలాహలంతో కాంగ్రెస్ కూడా స్పీడందుకుంది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర పార్టీ ముఖ్యులతో కలిసి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. వార్ రూమ్‌‌‌‌లో భేటీ అయింది. పార్లమెంట్ సెషన్ జరుగుతుండగానే ఎంపీలందరూ అదే కసరత్తులో బిజీగా గడిపారు. దాదాపు 30 నుంచి 40 మంది అభ్యర్థుల తొలి జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

బీజేపీ ఫస్ట్ లిస్ట్‌‌‌‌కు వెయిటింగ్

ఇప్పటికే ఎమ్మెల్యే ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టింది. రాష్ట్ర నేతలు అప్లికేషన్లను వడపోసి ఢిల్లీకి పంపారు. ఒకట్రెండు రోజుల్లో జాతీయ నాయకత్వం ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందని చెబుతున్నారు. 20 మంది సీనియర్ లీడర్లను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపేందుకు పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నది.

ఎఫెక్ట్ లేని స్పెషల్ సెషన్

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏం జరుగుతుందనే ఉత్కంఠ దేశమంతటా కొనసాగింది. రెండు వారాల పాటు ఎన్నో ప్రచారాలు జరిగాయి. వన్ నేషన్​– వన్ ఎలక్షన్ చర్చ మొదలుకావడంతో జమిలి ఎన్నికలుంటాయని, మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ బిల్లులు అమల్లోకి వస్తాయనే ఊహగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడుతాయా? అనే అనుమానంతో అన్ని పార్టీలు అయోమయంలో పడ్డాయి. సోమవారం మొదలైన పార్లమెంట్ స్పెషల్ సెషన్ కేవలం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పరిమితం కావటంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. మహిళా రిజర్వేషన్లు కూడా ఈ ఎన్నికలకు వర్తించబోవని తేలిపోవటంతో అసెంబ్లీ ఎలక్షన్ల నిర్వహణపై ఉన్న సందేహాలన్నీ  తొలగిపోయాయి. అందుకే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈసీ కూడా ఏర్పాట్లలో
నిమగ్నమైంది.

అక్టోబర్‌‌‌‌ 3 నుంచి ఈసీ టూర్

2018 డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జనవరి 16న అసెంబ్లీ తొలి సమావేశం జరిగింది. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంది. గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముగియాలంటే.. వీలైనంత తొందరగా షెడ్యూలు విడుదల చేయాలని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసిందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో ఈసీ నిమగ్నమైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర కమిషనర్లు, ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. మరోవైపు నోడల్​ అధికారులు, పోలీస్ అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోనూ ఈసీ టీమ్ సమావేశం కానుంది. ఈ టీమ్ ఢిల్లీకి వెళ్లిన ఒకట్రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.