టెస్లా వచ్చేస్తోంది.. త్వరలోనే కేంద్రంతో ఒప్పందం

టెస్లా వచ్చేస్తోంది.. త్వరలోనే కేంద్రంతో ఒప్పందం

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్​ కార్లు తయారు చేసే అమెరికా కంపెనీ టెస్లా ఇండియా రావడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంస్థ తన ఎలక్ట్రిక్ కార్లను వచ్చే ఏడాది నుంచి మనదేశానికి ఎగుమతి చేయనుందని, రాబోయే  రెండేళ్లలో ఫ్యాక్టరీని నిర్మించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  వచ్చే జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌లో ఈ విషయమై అధికారిక ప్రకటన రావచ్చని, ప్రస్తుతం చర్చలు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌గా జరుగుతున్నాయని పేర్కొన్నాయి.

గుజరాత్, మహారాష్ట్ర,  తమిళనాడులలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్​,  ఎగుమతుల కోసం అనువైన ఎకోసిస్టమ్​ఉంది. వీటిలో ఏదో ఒక రాష్ట్రానికి టెస్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని మరొక వ్యక్తి చెప్పారు. టెస్లా తన ప్లాంట్‌‌‌‌‌‌‌‌ కోసం దాదాపు కనీసం రెండు బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.1,661 కోట్లు)పెట్టుబడిని పెడుతుంది.  దేశం నుంచి ఆటో విడిభాగాల కొనుగోళ్లను 15 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెంచాలని చూస్తోందని తెలుస్తోంది.  

ఖర్చులను తగ్గించడానికి మనదేశంలోనే కొన్ని బ్యాటరీలను తయారు చేసే అవకాశం ఉందని ఒక అధికారి చెప్పారు. ఇండియాకు రావడంపై ఈ కంపెనీ తుది నిర్ణయం తీసుకోలేదని, ప్లాన్లు మారవచ్చని చెప్పారు. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ, టెస్లా భారతదేశంలో "భారీ పెట్టుబడి" పెట్టాలని యోచిస్తోందని, 2024లో ఇక్కడికి వస్తానని చెప్పారు.  కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ఆర్థిక, వాణిజ్యం,  పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు టెస్లా రాక గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు.  

టెస్లా ప్రతినిధి కూడా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. మనదేశ మధ్యతరగతి జనం నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్​కు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలోకి ప్రవేశించడం ఒక వరమని ఆటో ఇండస్ట్రీ ఎక్స్​పర్టులు అంటున్నారు. టెస్లాకు ప్రస్తుతం అమెరికా, చైనా,  జర్మనీలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

ఈవీలకు ప్రోత్సాహం..

మోదీ ప్రభుత్వం దేశీయంగా ఈవీల తయారీని పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు రాయితీలు ఇస్తోంది. అయినప్పటికీ వీటి సంఖ్య తక్కువగానే ఉంది. ఒక రిపోర్ట్​ ప్రకారం.. గత సంవత్సరం విక్రయించిన మొత్తం ప్యాసింజర్ వెహికల్స్​లో ఈవీల వాటా 1.3 శాతం మాత్రమే ఉంది.  ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండటం, ఛార్జింగ్ స్టేషన్ల కొరత కారణంగా కొనుగోలుదారులు వీటికి మారడానికి వెనుకాడుతున్నారు.  టెస్లా ఇక్కడ అమ్మబోయే కార్ల ధర 20 వేల డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా.

ఈ నెల ప్రారంభంలో కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌‌‌‌‌‌‌‌లోని టెస్లా ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. టెస్లా ఈ ఏడాది భారతదేశం నుంచి ఆటో విడిభాగాల కొనుగోళ్లను 1.9 బిలియన్ల డాలర్లకు పెంచాలని యోచిస్తోందని వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ గత ఏడాది దేశం నుంచి  బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను కొన్నదని చెప్పారు. 

ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారతదేశంలో అడుగుపెట్టడానికి టెస్లా కేంద్రంతో చాలాసార్లు చర్చలు జరిపింది. దిగుమతి సుంకాల తగ్గింపునకు కేంద్రం అంగీకరించకపోవడంతో అవి ముందుకు సాగలేదు. అయితే కొన్నాళ్ల ప్రతిష్టంభన తర్వాత మేలో చర్చలు మళ్లీ మొదలయ్యాయి.  కార్ల దిగుమతిపై భారతదేశం ఎక్కువ పన్నులు విధిస్తోందని మస్క్ విమర్శించారు.  

చైనాలో తయారైన కార్లను దేశంలో విక్రయించవద్దని టెస్లాకు మోదీ ప్రభుత్వం సూచించింది. కంపెనీ కోరినట్టుగా ఎలక్ట్రిక్​ కార్ల దిగుమతులపై సుంకాలు తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టే ఈవీ కంపెనీలకు ఐదేళ్లపాటు పన్ను రాయితీలు ఇస్తామని తెలిపింది.