ఓపెన్​ మార్కెట్లో గోధుమలు, బియ్యం అమ్మకం: ఫుడ్​సెక్రటరీ

ఓపెన్​ మార్కెట్లో గోధుమలు, బియ్యం అమ్మకం: ఫుడ్​సెక్రటరీ
  • ధరలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నం


న్యూఢిల్లీ: సెంట్రల్​ పూల్ (స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)​ నుంచి 50 లక్షల టన్నుల గోధుమలు, 25 లక్షల టన్నుల బియ్యం ఓపెన్​ మార్కెట్లో అమ్మనున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో  గోధుమలు, బియ్యం ధరలు తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బియ్యం రిజర్వ్​ ధరను కిలోకి రూ. 2 తగ్గించి రూ. 29 చేశారు. ఓపెన్​ మార్కెట్ సేల్​  స్కీమ్​ (ఓఎంఎస్​ఎస్​) కింద బియ్యం  కొనడానికి ఎక్కువ మంది ముందుకు రాకపోవడం వల్లే రేటును తగ్గించారు. గోధుమలపై ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గింపుపై భవిష్యత్​లో ఆలోచిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పరిస్థితులను గమనిస్తున్నామని, అవసరమైనప్పుడు ఆ చర్య తీసుకుంటామని పేర్కొంది.

 సెంట్రల్ పూల్​ నుంచి ఓఎంఎస్ఎస్​ కింద ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా బల్క్​ బయ్యర్లకు గోధుమలు, బియ్యం విక్రయిస్తోంది. ఈ ఏడాది జూన్​ 28 నుంచి ఈ–ఆక్షన్​ ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. గత రెండు నెలలుగా గోధుమలు, బియ్యం రేట్లు మార్కెట్లో పెరుగుతుండటం ప్రభుత్వ దృష్టికి  వచ్చిందని ఫుడ్​ సెక్రటరీ సంజీవ్​ చోప్రా మీడియాకు చెప్పారు. బియ్యం రిజర్వ్​ ధర తగ్గించడంతో ఇప్పుడు కొనుగోలుదారులు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓఎంఎస్​ఎస్​ కింద గోధుమల అమ్మకం బాగా సాగుతోందని ఆయన వెల్లడించారు. జూన్​లో  ప్రకటించిన గోధుమ, బియ్యం అమ్మకాలకు ఇప్పుడు ప్రకటిస్తున్నది  అదనమని 
వివరించారు.