పుదుచ్చేరిలో రూ. 415కే గ్యాస్ సిలిండర్

పుదుచ్చేరిలో రూ. 415కే గ్యాస్ సిలిండర్
  • కిందటి నెలలోనే రూ.300 తగ్గించిన సీఎం రంగస్వామి సర్కారు
  • తాజాగా కేంద్రం రూ.200 తగ్గించడం తో పేద కుటుంబాలకు భారీగా లబ్ది

పుదుచ్చేరి :  కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలపై రూ. 200 సబ్సిడీ ప్రకటించడంతో పుదుచ్చేరి ప్రజలకు భారీగా లబ్ధి జరగనుంది. డొమెస్టిక్ కస్టమర్లు రూ. 350 మేరకు సబ్సిడీ పొందనుండగా.. బీపీఎల్ కుటుంబాలకు ఏకంగా ఒక సిలిండర్ పై రూ. 700 సబ్సిడీ అందనుంది. ఇప్పటికే అక్కడ ఆయా వర్గాలకు సబ్సిడీ ఎక్కువగా ఉండటం, ఇప్పుడు కేంద్రం ప్రకటించిన సబ్సిడీతో వారికి భారీగా కలిసి వచ్చింది. పుదుచ్చేరి ప్రభుత్వం పోయిన నెలలోనే ఎల్లో రేషన్ కార్డ్ హోల్డర్లకు రూ.150 సబ్సిడీని, రెడ్ రేషన్ కార్డ్ హోల్డర్లకు రూ.300 సబ్సిడీని ప్రకటించింది. ఏటా 12 సిలిండర్లకు సబ్సిడీ వర్తింపచేయాలని నిర్ణయించింది. ఇప్పుడు కేంద్రం సిలిండర్ ధర రూ.200 తగ్గించింది.

అలాగే పీఎం ఉజ్వల యోజన కింద సిలిండర్లు పొందిన వారికి ఇప్పటికే రూ. 200 సబ్సిడీ ఉంది. దీంతో ఈ స్కీం కింద సిలిండర్ కనెక్షన్ ఉన్నవారికి రెండూ కలిపి రూ.400 మేర తగ్గనుంది. 14.2 కిలోల సిలిండర్ ధర పుదుచ్చేరిలో గతంలో రూ.1,115 ఉండగా.. ఇప్పుడు ఎల్లో కార్డ్ హోల్డర్లకు రూ. 765కే, రెడ్ కార్డ్ హోల్డర్లకు రూ.415కే లభించనుంది. కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించడంపై పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నిర్ణయంతో పేదల జీవితాల్లో ఇబ్బందులు తొలగాయని ఆయన కామెంట్ చేశారు.