గలీజ్​ వీడియోలు, ఫేక్​ పోస్టులు నడువయ్

గలీజ్​ వీడియోలు, ఫేక్​ పోస్టులు నడువయ్
  • సోషల్ ​మీడియా, ఓటీటీల కంట్రోల్​కు ఎథిక్స్​ కోడ్​
  • కొత్త రూల్స్​ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: సోషల్​ మీడియా, ఓటీటీల్లో వచ్చే ఫేక్​ మెసేజ్​లు, రెచ్చగొట్టే కామెంట్లు, గలీజ్​ వీడియోలు, అభ్యంతరకర సినిమాలు/వెబ్​సిరీస్​లకు చెక్​ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (గైడ్​లైన్స్​ ఫర్​ ఇంటర్మీడియరీస్​ అండ్​ డిజిటల్​ మీడియా ఎథిక్స్​ కోడ్​) రూల్స్​ 2021ను తీసుకొచ్చింది. ఎథిక్స్​ కోడ్​లోని ఆ వివరాలను గురువారం కేంద్ర మంత్రులు రవిశంకర్​ ప్రసాద్​, ప్రకాశ్​ జవదేకర్​ వెల్లడించారు. సోషల్​ మీడియా సైట్లు, ఓవర్​ ద టాప్​ (ఓటీటీ) ప్లాట్​ఫాంలు తప్పనిసరిగా ఆ రూల్స్​ను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. దేశంలో సోషల్​ మీడియా కంపెనీలు వ్యాపారం చేసుకోవడం తమకూ ఇష్టమేనని, కానీ ఆ కంపెనీల చర్యలను కంట్రోల్​ చేయాల్సిన అవసరమూ ఉందన్నారు. సోషల్​ మీడియా దుర్వినియోగం, రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కూడా సూచించిందని, ఇందులో భాగంగానే తాజా గైడ్​లైన్స్​ రూపొందించామని చెప్పారు. అందరితో చర్చించిన తర్వాతే వీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మహిళలను అసభ్యంగా చూపించే పోస్టులు,  ఫొటోల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని గైడ్​లైన్స్​లో పేర్కొన్నారు.

సోషల్​ మీడియా లేదా ఓటీటీ (ఓవర్​ ద టాప్​– ప్రైమ్, నెట్​ఫ్లిక్స్​ వంటివి) ప్లాట్​ఫాంలు కంటెంట్​పై వచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అందులో రెండు తమంతట తామే కంటెంట్​ను నియంత్రించుకునే (సెల్ఫ్​ రెగ్యులేషన్​) వ్యవస్థలను పెట్టాలి.

మొదటి అంచెలో సంబంధిత కంపెనీ/సోషల్​మీడియా సైట్​ సెల్ఫ్​ రెగ్యులేషన్​ (స్వీయ నియంత్రణ) వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

రెండో అంచెలో ఆ సెల్ఫ్​ రెగ్యులేషన్​ను నియంత్రించేందుకు ప్రభుత్వం తరఫున సెల్ఫ్​ రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు.

రెండో అంచెలో ఏర్పాటు చేసే సెల్ఫ్​ రెగ్యులేటరీ బాడీకి సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్​ జడ్జి లేదా ఏదైనా శాఖకు చెందిన జాయింట్​ సెక్రటరీ స్థాయి అధికారిని చీఫ్​గా నియమించాలి. పబ్లిషర్లకు ఆ అధికారే డిజిటల్​ కంటెంట్​పై సలహాలు, సూచనలు ఆదేశాలివ్వాలి. ఆ అధికారికి కంటెంట్​ను బ్లాక్​ చేసే అధికారమూ ఉంటుంది.

మొదటిరెండంచెల వ్యవస్థలను కంట్రోల్​ చేసేందుకు సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రక్షణ, విదేశాంగ శాఖ, హోం శాఖ, సమాచార ప్రసార శాఖ, న్యాయ, ఐటీ శాఖకు చెందిన నిపుణులు ఉంటారు. కోడ్​ ఆఫ్​ ఎథిక్స్​ను పాటించని కంటెంట్​పై సుమోటోగా విచారణ చేసే హక్కూ కమిటీకి ఉంటుంది.

ఓటీటీ ప్లాట్​ఫాంలు కచ్చితంగా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చీఫ్​ కంప్లయన్స్​ ఆఫీసర్​, నోడల్​ కాంటాక్ట్​ పర్సన్​, గ్రీవెన్స్​ (సమస్యలు) ఆఫీసర్​ను నియమించాల్సి ఉంటుంది.

ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా రూల్స్​ ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే డిజిటల్​ మీడియా సంస్థలు.. తప్పనిసరిగా సమాచార ప్రసారశాఖ వెబ్​సైట్​లో  రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది.

సోషల్​మీడియాకు ఇంటర్మీడియరీస్​

అభ్యంతరకర/అసభ్య పోస్టులు, సమస్యల పరిష్కారాల కోసం సోషల్​ మీడియా సంస్థలు రెండు విభాగాలుగా ఇంటర్మీడియరీ (మధ్యవర్తిత్వ శాఖ)లను ఏర్పాటు చేయాలి.

త్వరలోనే ఆ ఇంటర్మీడియరీలకు సంబంధించి యూజర్లకు కేంద్రం నుంచి నోటిఫికేషన్లు.

ఈ ఇంటర్మీడియరీల ద్వారానే సమస్య/ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థల ఏర్పాటు.

గ్రీవెన్స్​ ఆఫీసర్​ పేరునూ ఇంటర్మీడియరీలే ప్రకటించాల్సి ఉంటుంది. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే సమస్యను ఆ గ్రీవెన్స్​ అధికారి రిజిస్టర్​ చేయాల్సి ఉంటుంది. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి.

వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, తొలగించిన నిషేధిత కంటెంట్​ వంటి వివరాలతో నెలనెలా ఇంటర్మీడియరీలు కంప్లయన్స్​ రిపోర్ట్​ను ఇవ్వాలి.

ఇంటర్మీడియరీలదే బాధ్యత

కంప్లయన్స్​ ఆఫీసర్​గా నియమించే వ్యక్తి కచ్చితంగా ఇండియాలో ఉండే వాడై ఉండాలి. చట్టాలు, అందులోని రూల్స్​కు తగ్గట్టు ఆ అధికారి నడుచుకోవాలి.

పోలీసులు లేదా ఇతర చట్టబద్ధ సంస్థలతో 24 గంటల పాటూ కోఆర్డినేట్​ చేసుకునేలా నోడల్​ ఆఫీసర్​ను నియమించాలి.

ఫిర్యాదు/సమస్య పరిష్కార వ్యవస్థ కింద రెసిడెంట్​ గ్రీవెన్స్​ ఆఫీసర్​ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

వెబ్​సైట్​ లేదా మొబైల్​ యాప్​ లేదా రెండింట్లో పెట్టిన అడ్రస్​కు తగ్గట్టు ఇంటర్మీడియరీలు దేశంలోనే ఆఫీసులను (ఫిజికల్​ కాంటాక్ట్​ అడ్రస్) ఏర్పాటు చేయాలి.

మహిళల భద్రత, గౌరవానికి పెద్దపీట

ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోగా నిషేధిత కంటెంట్​/అభ్యంతర, అసభ్యకర కంటెంట్​ను ఇంటర్మీడియరీలు తొలగించాలి.

మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

మహిళలను అసభ్యంగా చూపించే పోస్టులు, న్యూడ్​ ఫొటోలు, సెక్స్​, వారి ప్రైవసీని దెబ్బతీసే కంటెంట్​పై కఠినంగా వ్యవహరించాలి.

మహిళల మార్ఫ్​డ్​ ఫొటోలు పెట్టి బెదిరింపులకు దిగే కంటెంట్​నూ వెంటనే తొలగించాలి.

మస్తు మంది యూజర్లు

సెల్​ఫోన్లు పెరగడం, నెట్​కనెక్టివిటీ ఎక్కువవడం వంటి కారణాలతో దేశంలో సోషల్​ మీడియా హవా కూడా పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ఏయే ప్లాట్​ఫాంలలో ఎంత మంది ఉన్నారో లెక్కలు చెప్పింది. దేశంలో వాట్సాప్​ వాడుతున్న వారి సంఖ్య 53 కోట్లని చెప్పింది. ఏ సోషల్​మీడియాతో పోల్చినా వాట్సాప్​ యూజర్లే ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్​ను 44.8 కోట్ల మంది, ఫేస్​బుక్​ను 41 కోట్ల మంది, ఇన్​స్టాగ్రామ్​ను 21 కోట్ల మంది, ట్విట్టర్​ను కోటీ 75 లక్షల మంది వాడుతున్నట్టు పేర్కొంది.

యూజర్ల వెరిఫికేషన్​

యూజర్ల వివరాలను సరిచూసుకునేందుకు (వెరిఫై) సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలు స్వచ్ఛంద వ్యవస్థను కలిగి ఉండాలి.  ఓ యూజర్​ పోస్ట్​ చేసిన కంటెంట్​ను తొలగించే ముందు.. ఎందుకు తొలగిస్తున్నారో ఆ యూజర్​కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యూజర్​ వివరణ కూడా తీసుకోవాలి.

ఇవీ రూల్స్

కంపెనీలు/సోషల్​ మీడియా స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.

ఆ సెల్ఫ్​ రెగ్యులేషన్​ వ్యవస్థ పర్యవేక్షణకు సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్​ జడ్జీతో రెగ్యులేటరీ బాడీ.

పై రెండు అంచెల్లో కంటెంట్​ నియంత్రణ జరగని పక్షంలో

కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో కమిటీ జోక్యం చేసుకుంటుంది.

తప్పుడు / వివాదాస్పద పోస్టులు సృష్టించిన వ్యక్తిని గుర్తించే బాధ్యత సంస్థలదే.

ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అభ్యంతరకర పోస్టులు తొలగించాలి

15 రోజుల్లోగా బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలి

ఫేక్​ మెసేజ్​ పుట్టించిన వ్యక్తిని గుర్తించాలె

తప్పుడు (ఫేక్​) వార్తలు/మెసేజ్​లు లేదా వివాదాస్పద, ద్వేషపూరిత పోస్టులు, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసే సెక్సువల్​ పోస్టులను పెట్టిన మొదటి వ్యక్తిని  కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్​ మీడియా సంస్థలే గుర్తించాలి.  దేశ సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, అత్యాచార, లైంగిక వేధింపులు ​వంటి తీవ్రమైన విషయాల్లో రూల్స్​ను కఠినంగా అమలు చేయాలి.

ఓటీటీలో ఐదు ఏజ్​ గ్రూపులు

ఈమధ్య ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. వెబ్​ సిరీస్​లలో అసభ్య సన్నివేశాలు ఎక్కువైతున్నాయి. సెన్సార్​ లేకపోవడంతో బూతులు, అసభ్య సన్నివేశాలు వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో కంటెంట్​ను ఐదు ఏజ్​ గ్రూపులుగా విడగొట్టేందుకు కేంద్రం రూల్స్​ తెచ్చింది. వాటి ప్రకారం…

యూ (యూనివర్సల్​), యూ/ఏ7+, యూ/ఏ13+, యూ/ఏ16+, ఏ (అడల్ట్​) అనే ఐదు కేటగిరీలుగా ఓటీటీలు కంటెంట్​ను విభజించాలి.

యూ/ఏ13+ నుంచి అడల్ట్​ కేటగిరీ వరకు కంటెంట్​పై పేరెంటల్​ లాక్​ పెట్టాలి.

అడల్ట్​ కేటగిరి కంటెంట్​కు కచ్చితంగా వయసును నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.