
పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి ఖిల్లా పైకి పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా ఉద్దేశించిన రోప్ వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. రూ.2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్ వే నిర్మాణం పర్వత మాల ప్రాజెక్టు కింద చేపడతారు.
దీని ద్వారా కోట పాదాల నుంచి కొండపై భాగానికి భక్తులు, పర్యాటకులు సులభంగా, సురక్షితంగా చేరుకుంటారు. అదనంగా, రామగిరి పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి మరో ₹2.5 కోట్లు కేటాయించిం ది కేంద్రం. దీనిపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. "ఇది చాలా కాలంగా సాగుతున్న పోరాటం. రామగిరి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ మౌలిక సదుపాయాల అవసరాన్ని పదేపదే పార్లమెంట్లో ప్రతిపాదించానని తెలిపారు.
రోప్ వే వల్ల భక్తులు, పర్యాటకులకు సౌలభ్యం కలుగుతుంది. అదనంగా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు, చిన్న వ్యాపారాలకు ఆదాయం వస్తుంది. రామగిరి అభివృద్ధి దిశగా ఇది ఒక కొత్త అధ్యాయం" అని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రామగిరి ఖిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటమే కాకుండా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందనుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.