కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత : లక్ష్మణ్

కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత : లక్ష్మణ్

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు,  ఫిట్నెస్ చాలా ప్రాముఖ్యమైనవి, అమూల్యమైంది. ఆటలు జట్టుకు స్ఫూర్తిని ఇస్తాయి. వ్యూహాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. నాయకత్వ నైపుణ్యాన్ని నిర్దేశించడం, రిస్క్ తీసుకుని లక్ష్యం వైపు నిలిచేలా దోహదపడుతాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నూతన విద్యా విధానంలో కూడా క్రీడలకు మంచి స్థానం దక్కింది.

జీవితంలో భౌతికంగా, మానసికంగా, ఆనందంగా గడపడానికి యువతకు క్రీడలు దోహదపడతాయి. ఇది యువతలో మంచి గుణాలను మూర్తిమత్వాన్ని ఏర్పరచుతాయి. క్రీడలు యువతలో శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. శరీరంలో అవయవాలు, కండరాల కదలికలు జరిగితే యువకుల్లో శారీరక ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. అవి మానసిక ఆరోగ్యాన్ని యువతీ యువకుల్లో పెంపొందిస్తాయి. తీరిక లేని జీవన విధానం వలన మానసిక అనారోగ్యానికి గురైన వారికి క్రీడలు మానసికంగా సేదతీరుస్తాయి. యుద్ధంలో పాల్గొనే సైనికుల చేత సంబంధిత అధికారులు క్రీడలు ఆడిస్తారు. దీని వలన యుద్ధం వల్లన కలిగే మానసిక ఒత్తిడి నుంచి వారికి విముక్తి లభిస్తుంది. వారికి మానసిక స్వస్థత కలుగుతుంది. అందుకే రిచర్డ్ కాబెట్ అనే రచయిత క్రీడలు మనిషి ఆరోగ్యానికి వైద్య సాధనంగా పని చేస్తాయని ప్రకటించాడు. ఎప్పుడూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చదవమని చెబుతుంటారు. ఆటలు ఆడితే మందలిస్తుంటారు. ఆ వైఖరిని తల్లిదండ్రులు మానుకొని తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి.  క్రీడల ద్వారా జరిగే లాభాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. తద్వారా యువతీ యువకుల్లో  విశ్వాసం, శ్రమించే గుణాలను కలుగజేస్తాయి. అవి సృజనాత్మక భావాలను, ప్రజాస్వామ్య భావాలను  యువతీ యువకుల్లో పెంపొందిస్తాయి. యువకులు మానవ సంబంధాలు కలిగి ఉండే అవకాశాలు పెరుగుతాయి. యువత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశాలుంటాయి. ఈ కోటాలో  కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రక్షణశాఖ, బ్యాంకులు, రైల్వే సంస్థలో యువత ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.

క్రీడా రంగం అభివృద్ధికి భారీ నిధులు

ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో కేంద్రం ప్రభుత్వం క్రీడారంగానికి భారీ నిధులు కేటాయించింది.  రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల కేటాయింపు ఉపయోగపడుతుంది. ఒలింపిక్స్  క్రీడాకారులు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన శిక్షణ, మౌలిక వసతుల కోసం నిధులు ఉపయోగపడతాయి. ఈ క్రీడా బడ్జెట్ ద్వారా శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) కు  గత ఏడాదికంటే  రూ.132.52 కోట్లను  అదనంగా కేటాయించారు. మొత్తంగా శాయ్ కు ఈసారి రూ.1045 కోట్లను కేటాయించింది కేంద్రం. మిగతా క్రీడా విభాగాలకు సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్​మెంట్ ఫండ్ కింద రూ.15 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కు రూ.325 కోట్లు, నేషనల్ సర్వీస్ గేమ్స్ కు మరో రూ.325 కోట్లు కేటాయించింది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల వరకు నిధులు అందనున్నాయి. మొత్తంగా క్రీడా రంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో క్రీడలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శక ఎంపిక ప్రక్రియ, క్రీడల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంపు వంటి చర్యలు నవ భారతానికి ప్రతీకగా మారాయి. నేడు దేశంలో కొత్త క్రీడా విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయాలు రానున్నాయి. ఇదంతా కేవలం క్రీడాకారుల సౌలభ్యం కోసమే గాక, క్రీడాకారులుగా మీ కలలను నెరవేర్చుకోవడం కోసమే.

విశ్వవేదికపై సత్తా చాటిన మన క్రీడాకారులు

గడిచిన అనేక సంవత్సరాలుగా క్రీడారంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మన దేశంలో ఆడే అన్ని క్రీడలకు బలమైన ఫ్రేమ్​వర్క్​ను నిర్మించడం ద్వారా భారతదేశంలోని క్రీడా సంస్కృతిని అట్టడుగు స్థాయిలో పునరుద్ధరించడానికి, భారతదేశాన్ని గొప్ప క్రీడా దేశంగా స్థాపించడానికి.. భారతీయ క్రీడలకు ఒక స్వర్ణయుగాన్ని 2018 లో నరేంద్ర మోడీ గారూ ‘ ఖేలో ఇండియా’ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి క్రీడలు చాలా ముఖ్యమైన భాగం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ  నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన విధానాలతో నేడు భారతీయ క్రీడారంగం స్థిరమైన పురోగతిని సాధిస్తున్నది.  క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లతో దేశవ్యాప్తంగా 294 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఖేలో ఇండియా పథకం ద్వారా జిల్లా స్థాయిలో క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖేలో ఇండియా జాతీయ నైపుణ్య కేంద్రాల ద్వారా అనేకమందికి ప్రోత్సాహం కల్పిస్తుంది. క్రీడల్లో ప్రతిభ ఉన్న తమను తాము నిరూపించుకునేందుకు క్రీడాకారులకు సరైన ప్లాట్ ఫాం కావాలి. ముఖ్యంగా దేశంలోని మారుమూల పల్లెల్లోని వారికి ఒకప్పుడు ఇది చాలా కష్టతరంగా ఉండేది. జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిలో మెరిసిన వారి ప్రతిభకు పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు. అయితే ఖేలో ఇండియా ప్రవేశ పెట్టడం ద్వారా ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి.17 ఏళ్లలోపు బాలబాలికలు తమలో ఉన్న స్పోర్ట్స్ ప్రతిభను బయటపెట్టేందుకు ఖేలో ఇండియా సరైన వేదిక అయింది. ఇక్కడ పతకాలతో మెరిసిన బాల బాలికలు ఆ తర్వాత విశ్వ వేదికపై తమ ప్రతిభను కనపరిచారు.

‘ఖేలో ఇండియా’తో  అసాధారణ విజయాలు

ఖేలో ఇండియా వేదికపై శిక్షణ పొందిన పలువురు ఆటగాళ్లు అనేక అసాధారణ విజయాలు సాధించారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తో భారత ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు పెంచాడు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో కూడా భారత ప్లేయర్లు పతకాలతో మెరిశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో టోక్యో ఒలింపిక్స్​లో అత్యధికంగా 7 పతకాలు గెలిచారు. ఇదే ఓ అద్భుతం అనుకుంటే.. ఈ ఒలింపిక్స్ కు వెళ్లిన వారిలో ఖేలో ఇండియాలో పాల్గొన్న అథ్లెట్లు కూడా ఉండటం మరో విశేషం. 2018లో జరిగిన తొలి ఖేలో ఇండియా గేమ్స్ లో మనుభాకర్ షూటింగ్ లో పాల్గొంది. అందులో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత అదే ఏడాదిలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా పాల్గొని అక్కడ కూడా బంగారు పతకంతో మెరిసింది. ఆ తర్వాత ఆమె టోక్యో ఒలింపిక్స్​లో కూడా స్థానం సంపాదించింది. ఖేలో ఇండియా ద్వారా శిక్షణ పొంది నేడు భారత దేశానికి వన్నెతెచ్చిన ఈ క్రీడాకారులను మన దేశంలోని యువత ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో అద్భుతమైన ప్రతిభను కనపరచాలి. క్రీడలో రాణించే యువకులకు ప్రతి ఏడాది 1000 మందిని ఎంపిక చేసి ఐదు సంవత్సరాల పాటు ఏడాదికి ఐదు లక్షల రూపాయల చొప్పున వారికి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది దేశంలోని యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకోవడానికి సువర్ణ అవకాశాన్ని కలిగిస్తుంది.

- డాక్టర్. కె.లక్ష్మణ్
రాజ్యసభ సభ్యులు. బీజేపీ  ఓబీసీ మోర్చా  జాతీయ అధ్యక్షులు