
- ఆయిల్ రంగ కంపెనీలకు రూ.30 వేల కోట్లు
- ఉజ్వల యోజన అమలుకు రూ.12 వేల కోట్ల సబ్సిడీ
- మెరైట్ స్కీమ్‌కోసం రూ.4,200 కోట్లు
- కేంద్ర కేబినెట్నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: ఎల్పీజీ ధరల స్థిరత్వం కోసం కేంద్ర ప్రభుత్వం 42 వేల కోట్లు కేటాయించింది. ఇందులో ప్రభుత్వ రంగ అయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.30 వేల కోట్లు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)కింద రూ.12వేల కోట్లు సబ్సిడీల కోసం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రపంచ మార్కెట్లో ధరల అస్థిరత నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
శుక్రవారం కేంద్ర కేబినెట్ఆమోదించిన పలు నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేంద్ర కేబినెట్, రాష్ట్ర రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీలు) అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్)లకు రూ.30 వేల కోట్ల సబ్సిడీని అందుకోనున్నట్టు చెప్పారు. 15 నెలలుగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను తక్కువ ధరలకు విక్రయించడం వల్ల ఈ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఇంటర్నేషనల్‌గా ఎల్పీజీ ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై పడనివ్వలేదన్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 12 విడతలలో ఆయిల్మార్కెటింగ్కంపెనీలకు సబ్సిడీ రూపంలో అందజేయనున్నట్టు వివరించారు. ఇది క్రూడ్ ఆయిల్ కొనుగోలు, లోన్ల తిరిగి చెల్లింపు, అనుబంధ కార్యకలాపాలలో పెట్టుబడులకు సహాయపడుతుందన్నారు.
అలాగే పీఎంయూవై పథకం కింద 2025–-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్ల సబ్సిడీని కూడా కేబినెట్ ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఈ స్కీమ్ 2016లో పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించేందుకు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సబ్సిడీ కింద, 14.2 కేజీ సిలిండర్‌కు ఏడాదికి 9 రీఫిల్స్‌కు రూ. 300 చొప్పున సబ్సిడీ అందిస్తారు. దేశ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సబ్సిడీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
మెరైట్ స్కీమ్‌కు రూ. 4,200 కోట్లు
275 సాంకేతిక సంస్థల్లో మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (మెరైట్) స్కీమ్‌కు రూ. 4,200 కోట్లను కేబినెట్ ఆమోదించిందని వైష్ణవ్ చెప్పారు.. ఈ స్కీమ్ 2025–-26 నుంచి 2029-–30 వరకు అమలవుతుందన్నారు. వరల్డ్ బ్యాంక్ లోన్ రూ. 2,100 కోట్లు తో 175 ఇంజినీరింగ్ కాలేజీలు, 100 పాలిటెక్నిక్‌లలో ఎడ్యుకేషన్‌ను మెరుగుపరచనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 7.5 లక్షల మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు.
మరక్కనం- పుదుచ్చేరి జాతీయ రహదారి విస్తరణ
మరక్కనం-–పుదుచ్చేరి హైవే(ఎన్‌హెచ్-332ఏ)ను 46 కిలోమీటర్ల మేర 4 లేన్లుగా విస్తరించేందుకు 2,157 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ చెన్నై, పుదుచ్చేరి, విలుప్పురం, నాగపట్టిణం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తగ్గిస్తుంది. దీనిద్వారా 8 లక్షల రోజులు డైరెక్ట్ గా, 10 లక్షల రోజలు ఇన్‌డైరెక్ట్ గాఉపాధి లభిస్తుంది.