రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

 

 

  • ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
  •  చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం
  • ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు రూ.10 వేల కోట్లతో నేషనల్ మిషన్
  • మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా
  • కేంద్ర కేబినెట్​లో నిర్ణయాలు

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల జీతానికి సమానమైన రూ.2,028.57 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్​బీ)ను ప్రకటించింది. దీంతో రైల్వేలోని 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. పీఎల్​బీ కింద గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్ గా అందనుంది. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని మూడు కారిడార్లలో, 128 మెట్రో స్టేషన్లతో నిర్మించనున్నారు. మొత్తం 118.9 కిలోమీటర్ల లైన్ అందుబాటులోకి రానుంది. దీనికి రూ.63,246 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. 2027 నాటికి పూర్తిచేయాలని ప్లాన్ రూపొందించారు. 

కేబినెట్ లో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. 

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పథకాలన్నింటినీ రెండు ప్రత్యేక స్కీమ్స్ కిందికి తెచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇప్పటికే అమలవుతున్న 18 పథకాలను వాటిల్లో చేర్చింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్.. ఆహార భద్రత, వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషోన్నతి యోజన స్కీమ్ తెచ్చింది. వీటిని మొత్తం రూ.1.01 లక్షల కోట్లతో అమలు చేయనుండగా.. ఇందులో కేంద్ర వాటా రూ.69,088 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.32,232 కోట్లు. 

మన దేశంలో ఆయిల్ సీడ్స్ సాగును పెంచి, వంట నూనెల దిగుమతులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ ను అమలు చేయనుంది. దీని కింద 2024–25 నుంచి 2030–31 వరకు రూ.10,103 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి 2022–23లో 39 మిలియన్ టన్నులు ఉండగా, దాన్ని 2030–31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

మరో ఐదు భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ఉంది. గ్లోబల్ ప్లాట్ ఫామ్ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ హబ్’లో మన దేశం చేరాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ప్రస్తుతం 16 దేశాలు ఉన్నాయి.