జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు : కేంద్రం

జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు : కేంద్రం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం 

న్యూఢిల్లీ: దేశ న్యాయ వ్యవస్థలో బ్రిటిష్ వలస పాలన కాలం నాటి నుంచి ఉన్న మూడు క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చిన చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ ఈ మేరకు శనివారం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో హిట్ అండ్ రన్ నిబంధన అమలును మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) 2023, భారతీయ సాక్ష్య చట్టం –2023 బిల్లులను పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 21న ఆమోదించింది. ఈ బిల్లులకు డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చాయి. తాజాగా ఈ మూడు కొత్త చట్టాలు జులై 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 

‘హిట్ అండ్ రన్’ రూల్ వాయిదా.. 

కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106, సబ్ సెక్షన్ 2 ప్రకారం.. వెహికల్స్, ట్రక్కుల డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి వ్యక్తుల మరణానికి కారణమైతే కఠినమైన శిక్ష విధించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా, దురుసుగా వాహనాన్ని నడిపి ఎవరినైనా ఢీకొట్టి చంపి..  పోలీసులకు లేదా మెజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వకుండా పారిపోయినట్లయితే10 ఏండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకూ ఫైన్ విధించాలంటూ ఇందులో నిబంధనలు చేర్చారు.

ఈ నిబంధనలపై దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ చట్టంలోని సెక్షన్ 106, సబ్ సెక్షన్ 2 అమలును వాయిదా వేస్తున్నామని నోటిఫికేషన్ లో కేంద్రం తెలిపింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపిన 
తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

కొత్త చట్టాల్లోని ముఖ్యాంశాలివే.. 

కొత్త చట్టం బీఎన్ఎస్ లో టెర్రరిజం పదానికి నిర్వచనాన్ని చేర్చారు. ఐపీసీలో దీనికి నిర్వచనం లేదు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం (దేశానికి వ్యతిరేకంగా నేరం) పేరుతో కొత్త సెక్షన్ చేర్చారు. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వం, యూనిటీకి భంగం కలిగించే చర్యల వంటి అంశాలను ఈ సెక్షన్ లో పేర్కొన్నారు. 

భారతీయ పౌరులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, మాటలు లేదా చేతలు లేదా రాతపూర్వకంగా లేదా సంజ్ఞల ద్వారా లేదా కంటికి కనిపించేలా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా లేదా ఆర్థిక తోడ్పాటు ద్వారా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తే దానిని దేశద్రోహం కింద పరిగణిస్తారు.

పాత చట్టంలోని రాజద్రోహ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా.. కొత్త చట్టం కింద నేరం రుజువైతే ఏడేండ్ల జైలు శిక్ష నుంచి గరిష్ఠంగా జీవితఖైదు, ఫైన్ విధించవచ్చు. భారతీయ పౌరుడు ఎవరైనా దేశం వెలుపల నుంచి ఈ సెక్షన్ కింద నేరానికి పాల్పడినా దోషిగా పరిగణించాలని చట్టంలో పేర్కొన్నారు.