డాక్ట‌ర్ల‌పై దాడులు చేస్తే క‌ఠిన శిక్ష‌లు: ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

డాక్ట‌ర్ల‌పై దాడులు చేస్తే క‌ఠిన శిక్ష‌లు: ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

క‌రోనా మ‌హమ్మారి నుంచి దేశాన్ని కాపాడ‌డానికి త‌మ ప్రాణాల‌ను సైతం రిస్క్ లో పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న డాక్ట‌ర్ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై కేంద్రం సీరియ‌స్ అయింది. క‌రోనా నివారణ‌కు చేసే ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకున్నా, ప్ర‌భుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, డాక్ట‌ర్ల‌పై హింస‌కు పాల్ప‌డినా స‌హించేంది లేదని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రైనా దాడుల‌కు దిగితే క‌ఠినంగా శిక్షించేలా 1897 నాటి ఎపిడ‌మిక్ డిసీజ్ చ‌ట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ స‌వ‌ర‌ణ‌ల‌కు బుధ‌వారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ స‌మావేశం ముగిసిన త‌ర్వాత కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఆ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌డానికి రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్న డాక్ట‌ర్ల‌పై దాడులు జ‌ర‌గ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని అన్నారు. వైద్య సిబ్బంది ప‌ట్ల‌ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, దాడుల‌కు పాల్ప‌డ‌డం లాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కాకుండా కేంద్ర చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు.

ఆర్డినెన్స్ లో పెట్టిన శిక్ష‌లివే..

వైద్య సిబ్బందిపై దాడుల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఎపిడ‌మిక్ డిసీజ్ యాక్ట్-1897ను స‌వ‌రిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామ‌ని, దీనికి రాష్ట్ర‌ప‌తి ఆమోదం త‌ర్వాత అమ‌లులోకి వ‌స్తుంద‌ని చెప్పారు కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్. వైద్యుల‌పై దాడుల కేసుల్లో గ‌రిష్ఠంగా ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంద‌ని చెప్పారు.

  • కొత్త ఆర్డినెన్స్ ప్ర‌కారం వైద్య సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే నాన్ బెయిల‌బుల్ కేసులు న‌మోద‌వుతుంది.
  • పోలీసులు 30 రోజుల్లోనే ఇన్వెస్టిగేష‌న్ పూర్తి చేయాలి.
  • దాడి‌లో ఎవ‌రికీ గాయాలు లేకున్నా స‌రే.. ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారికి మూడు నెల‌ల నుంచి ఐదేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌తో పాటు రూ.50 వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంది.
  • దాడి ఘ‌ట‌న‌లో వైద్యుల‌కు తీవ్ర గాయాలైతే.. దోషుల‌కు ఆరు నెల‌ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు త‌ప్ప‌దు. అద‌నంగా రూ. ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫైన్ విధించేలా చ‌ట్టంలో మార్పులు.
  • ఆస్ప‌త్రుల‌కు సంబంధించిన వాహ‌నాలు, లేదా ఇత‌ర ప్రాప‌ర్టీ ఏదైనా ధ్వంసం చేస్తే దోషులు వాటికి మార్కెట్ రేటుకు రెట్టింపు సొమ్ము చెల్లించాలి.