
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వడ్ల కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందని మీడియాలో ప్రచారమైన వార్తలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పందించింది. ఎప్పటిలాగే మద్దతు ధర ప్రకారం వడ్ల సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఢిల్లీలో ధాన్యం కొనుగోళ్లు, కోటా పెంపుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో, రాష్ట్ర మంత్రుల బృందంపై భేటీ అయింది. ఈ భేటీ తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. అయితే, కోటా పెంపుపై కేంద్ర మంత్రి స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై పలు మీడియా చానెల్స్, పత్రికల్లో కేంద్రం ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసిందని, ధాన్యం కొనుగోలు చేసేదే లేదని తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ శనివారం వివరణ ఇచ్చింది. వానాకాలానికి సంబంధించి వడ్ల కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపింది. దాని ప్రకారమే రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్టుగా ఆ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.