వందశాతం అక్షరాస్యతకు ఉల్లాస్..సాక్షర భారత్ స్థానంలో కొత్త ప్రోగ్రామ్

వందశాతం అక్షరాస్యతకు ఉల్లాస్..సాక్షర భారత్ స్థానంలో కొత్త ప్రోగ్రామ్
  • రాష్ట్రవ్యాప్తంగా అమలుకు తగు చర్యలు
  • ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా జిల్లా విద్యాశాఖ
  • జూన్ నుంచి ప్రారంభించేందుకు శిక్షణ 

మెదక్, వెలుగు: రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం –2020లో భాగంగా ‘ఉల్లాస్’(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ ది సొసైటీ )అనే కొత్త ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. గతంలోని సాక్షర భారత్ స్థానంలో ఉల్లాస్ ను అమలులోకి తెచ్చింది. డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ను తిరిగి స్కూల్స్, కాలేజీల్లో చేర్పించడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడం దీని ముఖ్యోద్దేశం. ఇందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. జిల్లా, మండల, స్కూల్ స్థాయిలో ప్రోగ్రామ్ ను వచ్చే జూన్ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుతం అధికారులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తోంది.  

ఓపెన్ స్కూలింగ్ ద్వారా బోధన, పరీక్షలు

కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షర భారత్​ప్రోగ్రామ్ ను పదేండ్ల కాలానికి అమలు చేయగా 2018లో ముగిసింది. ఆ తర్వాత 2020లో కొత్త విద్యా విధానం అమలులోకి వచ్చింది. దీనిద్వారా అందరికీ విద్య అందించేందుకు 2022 నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు  న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్(ఎన్​ఐఎల్​పీ) లో భాగంగా డిపార్ట్​మెంట్​ఆఫ్​ స్కూల్​ఎడ్యుకేషన్​అండ్​ లిటరసీ 'ఉల్లాస్'​ కు రూపకల్పన చేసింది.

ప్రాథమిక, ఆర్థిక, డిజిటల్​అక్షరాస్యత కల్పించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ అవగాహన, కుటుంబ సంక్షేమం, జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్​లక్ష్యాలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  స్కీమ్ అమలు కార్యాచరణ మొదలైంది. 100 శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాలకు అనుగుణంగా 14 ఏండ్ల వయసు పైబడిన డ్రాప్​ఔట్,​ బడీడు పిల్లలను గుర్తించి రాష్ట్ర ఓపెన్​స్కూల్​సొసైటీ (టాస్​)లో జాయిన్​చేయించి, పరీక్షలు రాయించి ఉత్తీర్ణులయ్యేలా చూస్తారు.

15 ఏండ్ల వయసు పైబడిన ఇంటర్ డ్రాప్​ఔట్​విద్యార్థులను కూడా 'టాస్​' లో జాయిన్​చేసి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల్లో(ఎస్​హెచ్ జీ) నిరక్షరాస్యులైన మహిళలకు కూడా చదవడం, రాయడం నేర్పిస్తారు.  

ప్రత్యేక మొబైల్​ యాప్ లో వివరాలు అప్ లోడ్  

ఉల్లాస్​ప్రోగ్రామ్ అమలుకు ప్రత్యేక మొబైల్ యాప్​ను రూపొందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్​డీఏ) ద్వారా సెల్ఫ్​హెల్ప్​గ్రూప్​మహిళల్లోని నిరక్షరాస్యులను (లెర్నర్స్​) గుర్తించి వివరాలు యాప్​లో అప్​ లోడ్​చేస్తారు. ఈజీగా చదవడం, రాయడం నేర్పించేందుకు ఎస్ఈఆర్టీ ఆధ్వర్యంలో 'అక్షర వాచకం' పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుండగా, వచ్చే జూన్​నుంచి ఉల్లాస్​ను అమలులోకి తీసుకొస్తారు.  నిరక్షరాస్యులకు  రోజూ రెండు గంటల చొప్పున మొత్తం 200 గంటల బోధన అందిస్తారు.  

క్లాసుల నిర్వహణకు పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్​వాడీ సెంటర్ల వంటి ప్రాంతాలను గుర్తించి, డిజిటల్​కంటెంట్​తో బోధించేందుకు కంప్యూటర్, టీవీలను సమకూరుస్తారు. ఉల్లాస్​ ప్రోగ్రామ్ ను జిల్లా, మండల, స్కూల్​ లెవల్​లో అమలు చేయనుండగా.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. 

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం

జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రస్తుతం జిల్లా స్థాయి కన్వర్జన్స్​మీటింగ్​లు నిర్వహిస్తున్నాం. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్​మేరకు ఎంపీడీఓల అధ్యక్షతన వివిధ శాఖల మండలాధికారులతో  కమిటీలను ఏర్పాటు చేసి పథకం ఉద్దేశం, లక్ష్యాలను వివరిస్తారు. రాబోయే మూడేండ్లపాటు కొనసాగే ప్రోగ్రామ్ లో  స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలి.  మురళీ, ఉల్లాస్​ అసిస్టెంట్ ​ప్రాజెక్ట్​ ఆఫీసర్, మెదక్