ఫండ్స్​ రిలీజ్ అయి ఐదేండ్లు దాటినా పనులు ఎక్కడికక్కడే

ఫండ్స్​ రిలీజ్ అయి ఐదేండ్లు దాటినా పనులు ఎక్కడికక్కడే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 22కోట్లు మంజూరు చేసింది. కాని, అధికారులు మాత్రం పనులను పట్టించుకోవడంలేదు. దీంతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకుండాపోయింది. ఫండ్స్​రిలీజ్ అయి ఐదేండ్లు దాటినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లు తయారైంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, పర్ణశాలతోపాటు కిన్నెరసాని ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాంతాలైనా పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం వంటి పట్టణాలకు సెంటర్​పాయింట్​గా ఉన్న కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్​రోడ్డులో నీతి అయోగ్ నిధులతో హరిత హోటల్, అద్దాల మేడ, కాటేజ్​ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాదిన్నరలో పనులు పూర్తి చేయాలని మొదట్లో నిర్ణయించారు. అయితే ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.  

జలగం ఓటమితో మరింత గ్యాప్..​

ప్రాజెక్టులో నిర్ణయించిన నిర్మాణాలకు అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​2016లో శంకుస్థాపన చేశారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్​కు జిల్లా నలుమూలల  నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు వేలాదిగా వస్తుంటారు. దీనికితోడు సింగరేణి కాలరీస్ కంపెనీ హెడ్​ఆఫీస్​కొత్తగూడెంలోనే ఉంది. కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్​ఐరన్ వంటి పరిశ్రమలతోపాటు సారపాకలోని ఐటీసీ, అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాట్, భద్రాద్రి పవర్ ప్లాంట్​వంటివి బడా సంస్థలున్నాయి. వీటన్నింటికి కేంద్ర బిందువు జిల్లా కేంద్రం కొత్తగూడెమే. పట్టణంలోని ఇల్లెందు–పాల్వంచ క్రాస్​రోడ్డులో అందరికీ ఉపయోగపడేలా హరిత హోటల్​నిర్మాణం పనులు చేపట్టారు. కిన్నెరసాని ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మిస్తున్న అద్దాల మేడతోపాటు కాటేజ్​లో ఉండేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ఓడిపోవటంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణాల్లో జాప్యం జరిగింది. అద్దాల మేడ, కాటేజ్​లు, సీసీ రోడ్లకు ఫారెస్ట్​ డిపార్ట్ మెంట్​అనుమతుల విషయంలో కొంత ఇబ్బంది పెట్టింది. దీంతో టూరిజం ఆఫీసర్లు అటవీశాఖ మినిస్టర్ తోపాటు ఆ శాఖ ముఖ్య అధికారులతో చర్చించడంతో ఇటీవలే పనులకు కొంత వెసులుబాటు లభించింది. కాగా హరిత హోటల్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. 

మరోసారి శిలాఫలకం...

రెండేళ్ల కింద పనులకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరోసారి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, టూరిజం ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో టూరిజం నిర్మాణ పనులు ‘ఒక అడుగు ముందుకు.. ఐదడుగులు వెనక్కి’.. అన్నట్లు సాగుతున్నాయి. మొత్తం నిర్మాణాలు పూర్తి అయితే పర్యాటకుల రాకపోకలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతుందని పరిసర ప్రాంతవాసులు భావిస్తున్నారు. 


నిర్మాణ దశలోనే పగుళ్లు...

రూ.కోట్లాది నిధులతో చేపట్టిన పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూరిజంశాఖ ఆధ్వర్యంలో పనులు సాగినప్పటికీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్​విభాగం అధికారులే పనులను మూడేండ్లపాటు పర్యవేక్షించారు. టూరిజం హోటల్ పనులు కొనసాగుతున్న క్రమంలోనే  పలు చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షాలతో మరికొన్ని చోట్ల లీకేజీలు కూడా ఏర్పడ్డాయి. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన భవనాలు నిర్మాణ దశలోనే పగుళ్లు ఏర్పడడం చూస్తే క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తోంది. పనుల్లో క్వాలిటీ లోపించడంతో టూరిజరం అధికారులు రెండేళ్ల కింద పర్యవేక్షించడం ప్రారంభించారు. ఇప్పటికైనా పనులు వేగంగా సాగి పూర్తి అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.