Movie Piracy India: మూవీ పైరసీకి పాల్పడితే మూడేండ్ల జైలు శిక్ష: కేంద్రం సంచలన నిర్ణయం

Movie Piracy India: మూవీ పైరసీకి పాల్పడితే మూడేండ్ల జైలు శిక్ష: కేంద్రం సంచలన నిర్ణయం

పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు.

చట్ట విరుద్ధంగా చిత్రాలను రికార్డు చేయడం, ప్రసారం చేయడం నేరమని పేర్కొన్నారు. అలా చేసిన వారికి మూడేండ్ల జైలు శిక్షపడుతుందని అన్నారు. నిర్మాణ వ్యయంలో మూడు శాతం వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో మూడు నెలల జైలు, రూ.3 లక్షల జరిమానా ఉండేదని అన్నారు. దానిని సవరించినట్టు చెప్పారు.

ఇదిలా ఉంటే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా పైరసీ భూతంతో పోరాడుతోంది. టాలీవుడ్‌లో ఇదొక సాధారణ సమస్యగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను 24 గంటలు గడవక ముందే ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్, కుబేర, కన్నప్ప సినిమాలు 24 గంటల్లోపే వచ్చేసి మేకర్స్ కి నష్టాలూ మిగిల్చాయి. 

విడుదలైన తొలి రోజు, రెండో రోజుకే హెచ్ డీ వెర్షన్ సినిమాలు పైరసీ సైట్లలో అందుబాటులోకి వస్తుండటంతో కొందరు థియేటర్ల ముఖం చూడటమే మానేశారు. థియేటర్కు వెళ్లి చూడకపోయినా ఓటీటీలో ఆ సినిమా విడుదలయ్యేంత వరకూ కూడా కొందరు ఆగడం లేదు.

పైరసీ సైట్లలో హెచ్డీ వెర్షన్ సినిమాలు చూస్తుండటంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న సినిమాలు ఘోరంగా నష్టపోతున్నాయి. ఇలాంటి క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణతో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.