గోదావరి-కావేరి లింక్‌పై జల్దీ తేల్చండి.. తెలంగాణను కోరిన కేంద్రం

గోదావరి-కావేరి లింక్‌పై జల్దీ తేల్చండి.. తెలంగాణను కోరిన కేంద్రం

తెలంగాణను కోరిన కేంద్ర సర్కారు
ప్రాజెక్టును హై ప్రయారిటీగా చేపట్టండి: తమిళనాడు
మా అవసరాలు తీరినంకనే ఎటైనా: ఏపీ
ఇంద్రావతి నీళ్లు మేమే వాడుకుంటం: చత్తీస్ గఢ్‌
నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌

హైదరాబాద్‌, వెలుగు: గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానంపై త్వరగా స్టడీ చేసి తేల్చాలని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ లింక్‌ను హై ప్రయారిటీగా చేపట్టాలని కేంద్రానికి తమిళనాడు సర్కారును కోరగా.. తమ రాష్ట్ర అవసరాలు తీరాకే నీళ్లు మళ్లించాలని ఏపీ వాదించింది. ఇంద్రావతి నీళ్లను తామే వాడుకుంటామని చత్తీస్‌గఢ్ ప్రస్తావించింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ ఖటారియా అధ్యక్షతన నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 17వ స్పెషల్‌ కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా గోదావరి, కృష్ణా, కావేరి లింక్‌పై రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపింది.

సర్కారుకు చెప్తం: మన ఇంజినీర్లు

గోదావరిలోని 247 టీఎంసీల నీటిని జానంపేట మీదుగా తమిళనాడులోని గ్రాండ్‌ ఆనికట్‌కు తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసింది. రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపింది. ఈ లింక్‌తో ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు అందడంతో పాటు సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆయకట్టును స్టెబిలైజ్‌ చేయొచ్చని ప్రతిపాదనల్లో పేర్కొంది. రాష్ట్రంలో సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు లబ్ధి కలుగుతుందని, ఏపీలో కృష్ణాతో పాటు పెన్నా బేసిన్‌కు నీళ్లు ఇస్తూ కావేరికి లింక్‌ చేస్తామని చెప్పింది. ప్రపోజల్‌పై తెలంగాణ వైఖరి చెప్పాలని రాష్ట్ర ఇంజనీర్లతో కేంద్ర మంత్రి అన్నారు. విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్తామని ఇంటర్‌ స్టేట్‌ ఎస్‌ఈ నరహరిబాబు, డిప్యూటీ డైరెక్టర్‌ కె. ప్రసాద్‌ తెలిపారు. భేటీలో రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి కొత్త ప్రపోజల్‌ అందలేదు.

ఏపీ అవసరాలు తీరాకే ఎటైనా..

గోదావరి, కృష్ణాలో కేటాయింపుల మేరకు నీటిని తాము వాడుకున్నాక మిగిలితేనే తమిళనాడుకు తరలించాలని ఏపీ వాదించింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఓ ప్రపోజల్‌ అందజేసింది. గోదావరిలో తమ రాష్ట్రానికి 526 టీఎంసీల నీళ్లు అలొకేషన్‌ ఉందని, అయితే పోలవరం నుంచి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. గోదావరి, కృష్ణాలో కలిపి తమ కేటాయింపుల మేరకు నీటిని వాడుకునేలా గోదావరి, కృష్ణా లింక్‌ ప్రాజెక్టును చేపడతామని నివేదించింది. తమ అవసరాలు తీరాక పెన్నా బేసిన్‌ మీదుగా గ్రాండ్‌ ఆనికట్‌ (కావేరి)కి తరలిస్తే తమకేం అభ్యంతరం లేదంది.

ఇంద్రావతిపై చత్తీస్‌గఢ్‌ కొత్త వాదన

ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే వాడుకుంటామని చత్తీస్‌గఢ్‌ ప్రస్తావించింది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయంటూ దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పింది. గోదావరి, కావేరి లింక్‌కు తాము ఆమోదం తెలుపబోమని తేల్చిచెప్పింది.

గోదావరి బేసిన్‌లో 890 టీఎంసీల మిగులు
గోదావరిలో 530 టీఎంసీలు, మహానదిలో 360 టీఎంసీల మిగులు జలాలున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ గుర్తించింది. 75 శాతం డిపెండబులిటీ ఆధారంగానే ఈ మేరకు నీళ్లున్నాయని, వాటిలోంచి 247 టీఎంసీలను గోదావరి, కృష్ణా, కావేరి లింక్‌లో భాగంగా వాడుకలోకి తెస్తామని ప్రతిపాదనల్లో పేర్కొంది. లింక్‌కు మహానది నీళ్లలో హక్కుదారైన ఒడిశా పెద్దగా అడ్డు చెప్పకపోయినా ఇంద్రావతిపై చత్తీస్ గఢ్‌ కొర్రీలతో ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్తుందని ప్రశ్న తలెత్తుతోంది.

For More News..

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..