
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీలు తీర్చే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా తెలంగాణ సర్కారు ఎజెండా రూపొందిస్తోంది. కీలకమైన అంశాలను చూపిస్తూ వాటిపై సెంటర్ కూడా ఏమీ చేయలేకపోయిందనే వాదనను తెరపైకి తేవడమే సర్కారు ఎజెండాగా కనిపిస్తోంది. బచావత్ అవార్డులోని క్లాజులను ముందుపెట్టి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేయనుంది. సీడబ్ల్యూసీని, కేఆర్‌ఎంబీని కార్నర్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. పొరుగు రాష్ట్రంతో నీళ్ల పంచాయితీ తెగేలా కనిపించకపోవడంతో దాన్ని మరింత గందరగోళంగా మార్చేందుకు కూడా వెనుకాడబోవడం లేదని తెలుస్తోంది.
భగీరథ కూడా అక్రమమన్న ఏపీ
పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు మన ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. ఏపీ కూడా ఇలానే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులు అక్రమమేనంది. మిషన్ భగీరథనూ అక్రమ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. అయితే ఏపీ సీఎం జగన్‌తో ఇప్పటికీ రాజకీయంగా అన్యోన్య బంధముందని ఇటీవల మీడియాతో సీఎం కేసీఆర్ చెప్పారు. చూసి కండ్లు మండుతున్నాయా అని ఎదురు ప్రశ్నించారు. నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్ల మధ్య మాత్రమే అంతరం కనిపిస్తోంది. కాబట్టి ఏపీతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే కేంద్ర జలశక్తి శాఖను, సీడబ్ల్యూసీని, కేఆర్‌ఎంబీని కార్నర్ చేయాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఎజెండా అవసరమా అని ఆలోచించి..
అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా ఇవ్వాలా అని ఆలోచించిన రాష్ట్రం రాజకీయంగా ఒత్తిడి ఎక్కువవడంతో పని మొదలు పెట్టింది. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుల కన్నా కృష్ణా నికర జలాల్లో ఇంకిన్ని నీళ్లు సాధించడంపైనే ఫోకస్ పెట్టింది. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఏపీ మళ్లిస్తోందని, ఆ నీటికి బదులుగా ఎగువన 45 టీఎంసీలను కృష్ణా నికర జలాల్లో తమకు కేటాయించాలని రాష్ట్రం కోరనుంది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు రాగానే కృష్ణా నికర జలాల్లో 80 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కేటాయించాలని జస్టిస్ బచావత్ అవార్డులో పేర్కొన్నారు. దీన్ని అపెక్స్ ఎజెండాలో ముఖ్యంగా ప్రస్తావించనున్నారు.
భగీరథ నీళ్లనూ ఏడో క్లాజ్ కిందే లెక్కగట్టాలి
తాగునీటికి ఏ రాష్ట్రమైనా తీసుకునే నీటిలో 20 శాతమే కోటాలో లెక్కగట్టాలని బచావత్ ఏడో క్లాజ్ చెప్తోంది. హైదరాబాద్ తాగునీటి కోసం తీసుకుంటున్న 16.50 టీఎంసీల కృష్ణా నీళ్లకు ఈ క్లాజ్ అమలు చేస్తే 13.20 టీఎంసీల నీళ్లు లెక్కలోంచి మినహాయించుకోవచ్చు. ఏపీ తాగునీటి విషయంలో ఈ మినహాయింపులివ్వాలి. భగీరథకు కృష్ణాలో 19.5 టీఎంసీలు, గోదావరిలో 23.76 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటోంది. ఈ నీటిని ఏడో క్లాజు కిందే లెక్కించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరనుంది. కనీసం 80 టీఎంసీల కృష్ణా నికర జలాలను తమకిచ్చేలా సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ చొరవ తీసుకోవాలని కోరనుంది. కేంద్రమే ఏపీని ఒప్పించి ఆ నీళ్లను కేటాయించాలని డిమాండ్ చేయనుంది.
ఈసారి ఎక్కువ వాడితే వచ్చేసారి కట్ చేయాలి
పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్, నాగల్ దిన్నె, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, వైకుంఠపురం బ్యారేజీలను అక్రమంగా నిర్మిస్తున్నారని, వాటి వల్ల తెలంగాణకు తీరని నష్టం జరగనుందని కౌన్సిల్‌కు ఇచ్చే ఎజెండాలో రాష్ట్రం చేర్చనుంది. ఒక వాటర్ ఇయర్‌లో వాడిన ఎక్కువ నీటిని తర్వాతి ఏడాది రిలీజ్ ఆర్డర్‌లో చేర్చాలని, ఆ మేరకు ప్రస్తుత ఇయర్‌లో కోత పెట్టాలని కోరనుంది. జూన్ మొదటి వారంలో నిర్వహించే కేఆర్‌ఎంబీ 12వ మీటింగ్‌కు ప్రభుత్వం ఇప్పటికే ఎజెండా రెడీ చేసింది. కృష్ణా నీళ్లలో ఎక్కువ నికర జలాలు సాధించే అంశాలనే ప్రస్తావించనుంది.