కేన్సర్‌‌‌‌‌‌‌‌పై పోరుకు గ్రిడ్ దేశవ్యాప్తంగా హాస్పిటళ్ల అనుసంధానం

కేన్సర్‌‌‌‌‌‌‌‌పై పోరుకు గ్రిడ్ దేశవ్యాప్తంగా హాస్పిటళ్ల అనుసంధానం
  • కేన్సర్‌‌‌‌‌‌‌‌పై పోరుకు గ్రిడ్ .. ఎన్సీజీని బలోపేతం చేస్తున్నామన్న కేంద్రం 
  • దేశవ్యాప్తంగా హాస్పిటళ్ల అనుసంధానం
  • మన రాష్ట్రం నుంచి 7 ఆస్పత్రులు 
  • డయాగ్నసిస్‌‌, ట్రీట్‌‌మెంట్‌‌పై పరస్పర సహకారం
  • అందరికీ ఒకే రకమైన వైద్యం అందేలా చర్యలు 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ‌‌కేన్సర్‌‌‌‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ కేన్సర్ గ్రిడ్ (ఎన్‌‌సీజీ) కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రాంతీయ భేదాలు, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ అత్యాధునిక వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా గ్రిడ్‌‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు బుధవారం లోక్‌‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జావాబిచ్చింది. ఎన్‌‌సీజీలో ప్రస్తుతం 300 సంస్థలు చేరాయి. ఇందులో హాస్పిటళ్లు, కేన్సర్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి ఎంఎన్‌‌జే, నిమ్స్‌‌, బసవతారకం, ఎల్వీ ప్రసాద్, ప్రతిమ, విరించి, ఏఐజీ హాస్పిటళ్లు ఉన్నాయి. కేన్సర్ డయాగ్నసిస్, ట్రీట్‌‌మెంట్, కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడిసిన్, రీసెర్చ్‌‌‌‌ వంటి అంశాల్లో ఈ హాస్పిటళ్లు, రీసెర్చ్ సంస్థల మధ్య గ్రిడ్‌‌ కోఆర్డినేటర్‌‌‌‌గా వ్యవహరిస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రీట్‌‌మెంట్, మెడిసిన్‌‌పై ఈ హాస్పిటళ్లలోని డాక్టర్లకు గ్రిడ్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తుంది. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల కేన్సర్ పేషెంట్లకు ఒకే రకమైన, మెరుగైన ట్రీట్‌‌మెంట్ అందుతుందని లోక్‌‌సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 

గంటకు 166 మందికి.. 

మన దేశంలో కేన్సర్ కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌‌(ఐసీఎంర్‌‌‌‌) ఆధ్వర్యంలోని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ లెక్కల ప్రకారం అన్ని రకాల కేన్సర్ కేసులు కలిపి 2021లో 14,26,447 నమోదైతే..  2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. అంటే కేసులు దాదాపు 2.45 శాతం పెరిగాయి. కేసులు నాలుగేండ్ల నుంచి ఏటా 2 నుంచి 2.75 శాతం వరకు పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి. కేన్సర్‌‌‌‌తో 2021లో 7.89 లక్షల మంది చనిపోతే, 2022లో 8.08 లక్షల మంది చనిపోయారు. 

రాష్ట్రంలో పదేండ్లలో 2.45 లక్షల డెత్స్.. 

మనం రాష్ట్రంలోనూ  కేన్సర్‌‌ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గడిచిన పదేండ్లలో (2013-–2022) రాష్ట్రంలో 4,48,387 కేన్సర్ కేసులు నమోదవగా.. 2,45,217 మంది కేన్సర్‌‌‌‌తో మరణించారు. 2013లో 39,933 మందికి కేన్సర్‌‌‌‌ వస్తే.. 2022లో 49,883 మందికి వచ్చింది. దాదాపు 24 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో ఎక్కువగా నోటి, బ్రెస్ట్‌‌, సర్వైకల్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. గుట్కా, పాన్ మసాలాతోనే రాష్ట్రంలో ఓరల్ కేన్సర్ కేసులు అధికంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో బ్రెస్ట్, సర్వైకల్, లంగ్స్, బ్లడ్ కేన్సర్ కేసులు ఉంటున్నాయి. 

రాష్ట్రంలో ఒక్కటే దవాఖాన.. 

మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆంకాలజీ సేవలు కేవలం హైదరాబాద్‌‌‌‌కే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌‌లోని ఎంఎన్‌‌జే హాస్పిటల్‌‌, వరంగల్‌‌‌‌లోని ఎంజీఎంలో తప్ప జిల్లాల్లో ఎక్కడా కేన్సర్ స్పెషలిస్టులు గానీ, కేన్సర్‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్ సెంటర్లు గానీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో లేవు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని దవాఖాన్లలో కేన్సర్‌‌‌‌ ‌‌‌‌క్లినిక్‌‌‌‌లు పెట్టాలని నాలుగేండ్ల కిందట అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ సెంటర్ల నిర్వహణకు నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌ కింద అప్పట్లోనే కేంద్రం నిధులు కూడా ఇచ్చింది.

కేన్సర్ లక్షణాలను గుర్తించడం, కేన్సర్ రోగులకు సేవలు అందించడంపై ఆయా జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు క్లినిక్‌‌‌‌లను ప్రారంభించకపోవడం గమనార్హం. కాగా, కేన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితుల్లో చాలా మందికి ఆ వ్యాధి ముదిరే వరకూ జబ్బున్న విషయం తెలియడం లేదు. ముందు రకరకాల మందులను వాడి, చివరకు హాస్పిటళ్లకు వస్తున్నారు. అప్పటికే రోగం మూడో స్టేజ్‌‌‌‌లోనో, నాలుగో స్టేజ్‌‌‌‌లోనో ఉంటోంది. అందువల్లే కేన్సర్‌‌‌‌‌‌‌‌ డెత్ రేట్ ఎక్కువగా ఉంటోందని.. ఫస్ట్, సెకండ్ స్టేజ్‌‌‌‌లోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో రికవరీ అవుతారని డాక్టర్లు చెబుతున్నారు. పీహెచ్‌‌‌‌సీ, ఏరియా, జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లకు ఎర్లీ స్టేజ్‌‌‌‌లోనే కేన్సర్లను గుర్తించడంపై పెద్దగా అవగాహన లేకపోవడం కూడా వ్యాధిని గుర్తించడంలో ఆలస్యానికి కారణమని హెల్త్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.