Chiranjeevi : 'మెగా157'పై అంచనాలు రెట్టింపు.. చిరంజీవి-నయనతారపై రొమాంటిక్ సాంగ్ షూట్!

Chiranjeevi : 'మెగా157'పై అంచనాలు రెట్టింపు..  చిరంజీవి-నయనతారపై రొమాంటిక్ సాంగ్ షూట్!

సినీ ప్రియుల దృష్టంతా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ పైనే ఉంది.  వీరిద్దరి కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం 'Mega 157' .  గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో కలిసి నటించినా..  ఈ సారి ఒకరికొకరు జంటగా నటించడం మాత్రం ఇదే మొదటిసారి .  ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తెరపై వీరి కెమెస్ట్రీని చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

రొమాంటిక్ పాట కోసం కేరళలో షూటింగ్.
 'మెగా157' మూవీలో లో చిరంజీవి, నయనతార మధ్య ఒక రొమాంటిక్ పాట ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.  ఇప్పటికే ఈ జోడీని తెరపైకి తీసుకురావడానికి ఒక మధురమైన గీతాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం కేరళలోని అందమైన లొకేషన్లు ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్  ఈ సాంగ్ కు నృత్యరూపకల్పన చేస్తున్నారు. 'సైరా'లో రొమాంటిక్ ట్రాక్ లేని లోటును 'మెగా157' తీరుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రొమాంటిక్ సాంగ్ మెగా అభిమానులకు కనుల పండుగ చేసే అరుదైన క్షణం అవుతుందని భావిస్తున్నారు. 

సంక్రాంతి 2026కి రిలీజ్ టార్గెట్
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న షెడ్యూల్ జూలై 23 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత చిత్ర బృందం కొద్దిపాటి విరామం తీసుకుని, ఆగస్టులో హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026కి విడుదల చేయాలని ఇప్పటికే  నిర్మాతలు ప్రకటించారు. పండుగ సీజన్‌కు ఉండే భారీ వసూళ్లను దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమాను కచ్చితంగా ఆ తేదీకే విడుదల చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇది కమర్షియల్‌గా చిత్రానికి మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు.

 

నయనతార రీఎంట్రీ
నయనతార దాదాపు రెండేళ్ల తర్వాత 'మెగా 157' మూవీ తో తెలుగు తెరకు తిరిగి వస్తున్నారు. చివరిసారిగా 'జవాన్' చిత్రంలో కనిపించిన ఈ లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు చిరంజీవి సరసన రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆమె కమ్‌బ్యాక్ చాలా స్టైలిష్‌గా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'విశ్వంభర' కూడా రెడీ!
ఒకవైపు 'మెగా157'తో బిజీగా ఉన్న చిరంజీవి, మరోవైపు 'విశ్వంభర' సోషియో-ఫాంటసీ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.   ఈ సినిమాను సెప్టెంబర్ 18 లేదా 25 తేదీలలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ వరుస సినిమాలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..