మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రాలేదు

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రాలేదు

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ అవార్డు ప్రకటించడమే నిదర్శనమని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. అయితే మంత్రుల వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. అవన్నీ అవాస్తవాలే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నోట్ను  విడుదల చేసింది. మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు వచ్చిందనేది పూర్తి అబద్దమని పేర్కొంది. అసలు మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అంచనా వేయనేలేదని వెల్లడించింది. తెలంగాణలో వంద శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని పేర్కొంది.

 

నీళ్లు తాగడానికి పనికిరావు..
మిషన్ భగీరథకు  జాతీయ అవార్డు వచ్చిందంటూ..తెలంగాణ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని జలశక్తి శాఖ ఆరోపించింది. తెలంగాణలో వంద శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేసీఆర్ ప్రభుత్వం తమకు నివేదించిందని  వెల్లడించింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలని.. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదని స్పష్టం చేసింది. NJJM ద్వారా మిషన్ భగీరథ  పథకాన్ని కేంద్రం  సమీక్షించిందన్న వార్తల్లో కూడా  నిజం లేదని  ప్రకటించింది. మిషన్ భగీరథపై  ఎలాంటి అసెస్ మెంట్  చేయలేదని  స్పష్టం చేసింది. ఫంక్షనాలిటీ అసెస్ మెంట్ లో భాగంగా తాము 409  గ్ర్రామాల్లోని   12 వేల 570 ఇండ్లలో  సర్వే చేశామని తెలిపింది. ఇందులో 8 శాతం ఇండ్లు  రోజుకు 55 లీటర్ల  కంటే తక్కువ  తాగునీరు పొందుతున్నాయని   తేలిందని ప్రెస్ నోట్ లో పేర్కొంది.  దాదాపు  5 శాతం ఇండ్లకు  సరఫరా అవుతున్న నీళ్లు తాగడానికి పనికిరావని సర్వేలో  తేలిందని ప్రకటించింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబర్ 2న తెలంగాణకు అవార్డు ఇస్తున్నట్టుగా తెలిపింది.

అవార్డుపై మంత్రులేమన్నారు.. 
మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవలే ప్రకటించారు. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్‌భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కిందని పేర్కొన్నారు.

గాంధీ జయంతి రోజున తెలంగాణ వందశాతం ఇళ్లకు నల్లా నీరు ఇస్తున్నందుకు కేంద్రం అవార్డు ఇస్తోందని వెల్లడించారు. అంతేకాకుండా కేంద్రం ఢిల్లీలో తెలంగాణను ప్రశంసిస్తోంది....గల్లీలో విమర్శిస్తోందని మంత్రులు మండిపడ్డారు. మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును సాక్ష్యంగా చూపిస్తూ..అవార్డులే కాదు..తెలంగాణకు నిధులు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.