
మందమర్రి, వెలుగు: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసి ఐదేళ్లు గడుస్తున్నా మళ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. హైకోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతున్న సింగరేణి యాజమాన్యానికి తాజాగా కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ కమిషన్ చర్చలకు రావాలంటూ లెటర్ పంపారు. ఎన్నికల నిర్వహణపై చర్చించడానికి సోమవారం హైదరాబాద్లోని తమ ఆఫీస్కు రావాలని కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ డి.శ్రీనివాసులు నవంబర్ 29న సింగరేణి యాజమాన్యానికి లెటర్ రాశారు.
గతంలో పోటీ చేసిన రిజిష్టర్డ్ యూనియన్ల వివరాలు, వార్షిక నివేదికలు, సభ్యత్వాల సంఖ్య లాంటి వివరాలతో రావాలని సూచించారు. సింగరేణిలో కొద్దికాలంగా అన్నీ తానై రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తోంది. దీంతో సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సర్కారుపై ఆధారపడాల్సి వస్తోంది. సింగరేణి సీఎండీ సర్కారు పెద్దల కనుసన్నల్లో పాలన సాగిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, తాజాగా డిప్యూటీ సీఎల్సీ చర్చలకు రావాలంటూ లెటర్ రాయడంతో సింగరేణికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర సర్కారు దృష్టికి తీసుకువెళ్లినా అటునుంచి ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. మరోవైపు హైకోర్టు విధించిన గడువు రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం డీసీఎల్సీతో జరిగే కీలక భేటీలో సింగరేణి ప్రతినిధుల స్పందనపై గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ ఆధారపడింది.
ఐదేళ్లుగా ఎన్నికలు లేవ్
సింగరేణిలో 2017 అక్టోబర్ 5న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిచింది. టీబీజీకేఎస్ సంఘానికి రెండేళ్ల కాలపరిమితి నిర్ణయిస్తూ కార్మిక శాఖ ఆఫీషియల్సర్టిఫికెట్జారీ చేసింది. అయితే తమకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లు కొనసాగే అధికారం ఉందని టీబీజీకేఎస్కోర్టును ఆశ్రయించింది. తీర్పు రాకుండానే చివరకు నాలుగేళ్లు గడిచిపోయి అదనంగా మరో ఏడాది కూడా పూర్తయ్యింది. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు ఉద్యమబాట పట్టాయి. అయితే రాష్ట్ర సర్కార్ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై జాప్యం చేస్తోంది. అధికార పార్టీ చేపట్టిన ఇంటర్నల్సర్వేలో టీబీజీకేఎస్ పనితీరుపై కార్మికుల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు తేలడంతో ఎన్నికలకు రాష్ట్ర సర్కార్ చొరవచూపడం లేదని ప్రతిపక్ష కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న జనరల్ ఎలక్షన్లపై ఉంటుందని రాష్ట్ర సర్కార్ భావించడంతో ఎన్నికలకు వెనకాడుతోందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర సర్కార్ నుంచి ఎన్నికలపై ఎలాంటి కదలిక రాకపోయినా టీఆర్ఎస్అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్లీడర్లు మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ వేదికలపై ప్రచారం చేసుకుంటున్నారు.
భేటీపై కార్మికుల ఆశలు
ఐదేళ్లు దాటినా సింగరేణిలో గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ నుంచి కదలిక రాకపోవడంతో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు అక్టోబర్ 28న ఇంటీరియం ఆర్డర్ జారీ చేసింది. మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఎల్ఎల్సీ, డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి సీఎండీ, కేంద్ర కార్మికశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు కేంద్ర కార్మికశాఖ మంత్రిత్వశాఖ కూడా స్పందించి యూనియన్ల సభ్యత్వ వివరాలను సమర్పించాలని కోరింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర కార్మికశాఖ ముఖ్య ఉప కమిషనర్ డి.శ్రీనివాసులు సింగరేణి యాజమాన్యానికి లెటర్ రాశారు. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని డిప్యూటీ సీఎల్సీని సింగరేణి యాజమాన్యం కలువనుంది. ఇందులో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్ వ్యూస్, సింగరేణి తీసుకునే చర్యలను యాజమాన్యం వెల్లడించనుంది. ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి కదలిక రాని నేపథ్యంలో సోమవారం డీఎల్సీతో సింగరేణి ప్రతినిధుల కీలక భేటీపై కార్మిక వర్గం ఆశతో ఎదురుచూస్తోంది. మరోవైపు ఆర్ఎల్సీ, డీసీఎల్సీని కలిసి హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మరో సారి కోరుతామని ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.