టీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కేటీఆర్ అమెరికాకు పోవడమూ ఖాయం

టీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కేటీఆర్ అమెరికాకు పోవడమూ ఖాయం

మల్కాజ్‌‌గిరి: సీఎం కేసీఆర్ నాలుగు నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్నాడు గానీ ఆరేళ్లు గడుస్తున్నా ప్రజలకు డబుల్ బెడ్రూమ్స్ కట్టివ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మల్కాజ్‌‌గిరిలో బీజేపీ నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోకపోవడం గురించి ఆయన ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కిషన్ రెడ్డి కోరారు.

‘గత జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తామని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. నాలుగు నెలల్లో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారు కానీ, 6 సంవత్సరాలు అవుతున్నా సామాన్య జనాలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ పనులు ప్రగతి భవన్‌‌ను దాటడం లేదు. ప్రభుత్వం వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే వెనుక నుంచి టీఆర్ఎస్ నాయకులు రూ.5 వేలు తీసుకున్నారు. 40 మంది చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదు. ఈ ఎన్నికల్లో డబ్బులతో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దుబ్బాకలో గెలిచినట్టు జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. కల్వకుంట్ల కుటుంబం, ఓవైసీ కుటుంబ పాలన పోవాలి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం. ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ అమెరికాకు పోవడం ఖాయం’ అని కిషన్‌‌రెడ్డి పేర్కొన్నారు.