రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ : ఎంపీ వంశీకృష్ణ

రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ : ఎంపీ వంశీకృష్ణ
  • రూ.150 కోట్లతో కేంద్రం టెండర్లు పిలిచింది: ఎంపీ వంశీకృష్ణ 

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటవుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ అంశం పెండింగ్​లో ఉన్నదని, తాను కేంద్రంపై ఒత్తిడి తేవడంతోనే మంజూరైందని తెలిపారు. 

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రూ.150 కోట్లతో టెండర్ ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు. గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదేండ్ల కిందే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి అన్ని క్లియరెన్స్​లు వచ్చాయి. అయినా.. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు వినతిపత్రాలు ఇచ్చాం. ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాం. 

దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే.. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్, సింగరేణి, హమాలీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు మేలు జరుగుతది’’అని వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. 13 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన రామగుండం ఎరువుల కర్మాగారం 9 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి చేస్తున్నదన్నారు. దీనికి లీకేజీలు, షట్​డౌన్​లే కారణమని తెలిపారు. 

రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించాలనే తపనతో మూతపడ్డ ఈ ఫ్యాక్టరీని మంత్రి వివేక్ వెంకటస్వామి.. రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించి రీ ఓపెన్​ చేయించారని పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లిలోని ఎంపీ ఆఫీస్​లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు గుమ్మడి కుమారస్వామి, బోయిని మల్లేశ్ యాదవ్, అనుమాస శ్రీనివాస్, కల్వల సంజీవ్, తిప్పారపు మధు, జావెద్, శ్రీధర్ పటేల్, సురేందర్, శ్యామ్​సుందర్, తదితరులు పాల్గొన్నారు.