తగ్గనున్న వంట నూనెల ధరలు

తగ్గనున్న వంట నూనెల ధరలు
  • వంట నూనెలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్రం
     

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు శుభవార్త. పండుగల వేళ వంటనూనెల ధరలు తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించింది. క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. రీఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని 17.5 శాతానికి తగ్గించింది. అలాగే క్రూడ్‌ పామాయిల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. ప్రపంచంలో అత్యధిక నూనెల వినియోగం ఉన్న భారతదేశంలో వంట నూనెలు ధరలు కొంత కాలంగా భారీగా పెరిగాయి. దేశంలోని అవసరాల కోసం మూడింట రెండొంతులు విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా గత సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 16.9 8లక్షల టన్నులు అంటే దేశీయ అవసరాల్లో దాదాపు 63 శాతం దిగుమతి చేసుకున్నారు. ఈ  నేపథ్యంలో కస్టమ్స్ డ్యూటీని మరింత తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరలు తగ్గించాలని నిర్ణయించిన కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకుంది.  
ముఖ్యంగా పండుగల సీజన్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేందుకు సన్ ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్ దిగుమతులపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశానికి అవసరమైన వంట నూనెల్లో ఎక్కువ శాతం ఇండోనేషియా, మలేసియాల నుంచి పామాయిల్‌, అర్జంటైనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.