మార్కెట్​లోకి భారత్ రైస్ .. కిలో రూ.29 మాత్రమే

మార్కెట్​లోకి  భారత్ రైస్ .. కిలో రూ.29 మాత్రమే
  • ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన
  • నాఫెడ్, ఎన్​సీసీఎఫ్ కేంద్రాల్లో అందుబాటులోకి
  • ఈ కామర్స్ సైట్​లోనూ అమ్మకాలు
  • ఐదు, పది కిలోల ప్యాక్​లలో లభ్యం

న్యూఢిల్లీ: వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్​లో కిలో రూ.29 చొప్పున ‘భారత్ రైస్’ విక్రయిస్తామని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌‌‌‌‌‌‌‌ చోప్రా శుక్రవారం ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వివిధ రకాల సరుకులపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, పోయిన ఏడాదితో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8 శాతం, హోల్​సేల్ ధరలు 15.7 శాతం పెరిగాయి. నిత్యవసర సరుకుల ధరలు, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే సబ్సిడీలో ‘భారత్ రైస్’ ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో అమ్మేందుకు సిద్ధమైంది’’ అని సంజీవ్ చోప్రా వెల్లడించారు. 

ఇప్పటికే భారత్ ఆట, భారత్ దాల్ విక్రయాలు

నేషనల్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (నాఫెడ్), నేషనల్‌‌‌‌‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ కన్జ్యూమర్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఎన్​సీసీఎఫ్), కేంద్రీయ భండార్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల్లో బియ్యం విక్రయిస్తామని సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఈ కామర్స్ ప్లాట్​ఫామ్స్​లో కూడా భారత్ రైస్ కొనుగోలు చేయొచ్చన్నారు. ఐదు, పది కిలోల ప్యాక్స్​లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఫస్ట్ ఫేజ్​లో భాగంగా.. 5లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్​లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే కిలో రూ.27.50 చొప్పున భారత్ ఆట, రూ.60 కిలో భారత్ దాల్ (శనగ పప్పు) విక్రయిస్తున్నామని తెలిపారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేసే ఆలోచలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. 
అలాంటి పుకార్లు నమ్మొద్దన్నారు.  

స్టాక్ వివరాలు వెల్లడించాలి

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రిటైలర్స్, హోల్​సేలర్స్, ప్రాసెసర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాల స్టాక్​ను ప్రకటించాలని సంజీవ్ చోప్రా ఆదేశించారు. అన్ని బియ్యం కేటగిరీల స్టాక్ పొజిషన్ బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి వైట్ రైస్, పారా బాయిల్డ్ రైస్, బాస్మతి బియ్యం నిల్వ వివరాలను ప్రతి వారం ఆహార, ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో ప్రకటించాల్సి ఉంటుందన్నారు. బియ్యం నిల్వలపై పరిమితి విధించే ఆలోచన ఇప్పుడైతే లేదన్నారు. స్టాక్ పొజిషన్ తో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. బియ్యం మినహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయని చెప్పారు. గోధుమల ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం వీకెండ్​లో ఈ వేలం ద్వారా స్టాక్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూనే ఉందన్నారు. మొత్తం 10.1 మిలియన్ టన్నులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 7.5 మిలియన్ టన్నులు ఇప్పటికే ఓఎంఎస్ఎస్ కింద అమ్మేశామన్నారు.