మద్దతు ధరలు భారీగా పెంచిన కేంద్రం

మద్దతు ధరలు భారీగా పెంచిన కేంద్రం
  • పంటల సాగు విస్తీర్ణం పెంపు కోసమే ధరల పెంపు: కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు  సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధరలను (ఎం.ఎస్.పి)లను పెంచింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యం క్వింటాకు రూ.72 మేర పెంచారు. ప్రస్తుతం క్వింటాకు రూ.1868 ఇస్తుండగా.. ఇకపై రూ.1940 చెల్లించనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి  నరేంద్రసింగ్‌తోమర్‌ తెలిపారు. 
అలాగే నువ్వుల ధర క్వింటాలుకు రూ. 452, కంది, మినప పప్పు ధరలు క్వింటాలుకు రూ. 300 చొప్పున పెంచారు. వేరుశనగ క్వింటాలు ధర రూ. 275 చొప్పున పెంచినట్లు ప్రకటించారు. అలాగే క్వింటా జొన్నలకు ప్రస్తుతం రూ.2,150 ఇస్తుండగా.. దాన్ని రూ.2,250కి పెంచారు. ఈ పంటల విస్తీర్ణం బాగా పెంచాలనే ఉద్దేశంతో వీటి కనీస మద్దతు ధరలను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రైల్వేల్లో కమ్యూనికేషన్ మరియు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణకు 25 వేల కోట్లు
భారత రైల్వేలలో కమ్యూనికేషన్లు మరియు సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.25 వేల కోట్లతో ఒక ప్రాజెక్టును కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం రైల్వే శాఖ  ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్ వర్కు పై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత రైల్వేల కోసం 700 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లో 5 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని మంత్రి పీయూష్‌గోయల్‌ వెల్లడించారు.