V6 News

2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన..లోక్‌‌‌‌సభ సీట్లు 850.?

2011  జనాభా లెక్కల  ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన..లోక్‌‌‌‌సభ సీట్లు 850.?
  •  
  • రాష్ట్రాల నుంచి 815 మంది, యూటీల నుంచి 35 మంది
  • 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ
  • ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ
  •     డీలిమిటేషన్ బిల్లు-2026, మహిళా రిజర్వేషన్‌‌‌‌ బిల్లులు సిద్ధం
  •     వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లు
  •     ఎంపీలకు ముసాయిదా ప్రతులు అందజేసిన కేంద్రం
  •     ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు
  •     బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్‌‌‌‌ కోసం కమిషన్‌‌‌‌
  •     చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి 
  •     సభ్యులుగా సీఈసీ లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు
  •     శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌‌‌‌), మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌‌‌‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది.  ఇప్పటికే డీలిమిటేషన్ –2026  డ్రాఫ్ట్ బిల్లును  కేంద్ర న్యాయ శాఖ  సిద్ధం చేయగా.. దీన్ని ఆ శాఖ మంత్రి అర్జున్‌‌‌‌ రామ్​ మేఘవాల్‌‌‌‌ ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లును తీసుకురానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఈ బిల్లుల ముసాయిదా ప్రతులను ఎంపీలకు పంపింది. ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని, ఇందులో లోక్ సభ సీట్ల పెంపు.. డీలిమిటేషన్​కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. డీలిమిటేషన్‌‌‌‌ బిల్లు ఆమోదం పొందితే.. ఇది 131వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం మంగళవారం జారీ చేసింది. ఈ చట్టం ప్రకారమే లోక్‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను పునర్విభజన చేయనున్నారు. ఆ ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్య 850 వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల ఎంపీ సీట్లు 35కు మించకుండా ఉండాలని ఈ చట్టంలో ప్రతిపాదించనున్నారు.


కొత్త ప్రతిపాదన ప్రకారం, లోక్‌‌‌‌సభలో రాష్ట్రాల నుంచి 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ప్రతినిధులు ఉంటారు. తద్వారా మొత్తం సభ్యుల సంఖ్య 850కి చేరుతుంది. దీని మేరకు కేంద్రం డీలిమిటేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను కేంద్రం ఏర్పాటు చేయనున్నది. ఈ కమిషన్ తీసుకునే నిర్ణయాలు గెజిట్‌‌‌‌లో ప్రచురితమైన తర్వాత చట్ట రూపం దాలుస్తాయి. ప్రస్తుత సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉండగా.. తాజా మార్పులు ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం (2011 సెన్సస్‌‌‌‌) జరుగుతాయి. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల మేరకే సీట్లు కేటాయించాలని బిల్లులో ప్రతిపాదించారు. నియోజకవర్గాలను భౌగోళికంగా అనుకూలంగా, పరిపాలనా సౌలభ్యం ఉండేలా మారుస్తారు. అయితే, ప్రస్తుతం ఉన్న సభ రద్దయ్యే వరకు పాత నియోజకవర్గాలే కొనసాగుతాయి. కాగా, ఈ బిల్లు అమల్లోకి వస్తే  పాత డిలిమిటేషన్ చట్టం –2002 రద్దవుతుంది. పెరిగిన జనాభా, వలసలు, నియోజకవర్గాల మధ్య జనాభా వ్యత్యాసాలను సరిచేయడానికి, అలాగే మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ కొత్త చట్టం అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 

మహిళా రిజర్వేషన్ల అమలు

ఈ బిల్లులో అత్యంత కీలకమైన అంశం మహిళా రిజర్వేషన్. లోక్‌‌‌‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) సీట్లను కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో కూడా మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు  ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తూ  రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు.  తాజా జనాభా లెక్కల  ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. నియోజకవర్గాల విభజన సమయంలో భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుంటారు. మహిళల ప్రాతినిథ్యాన్ని ప్రజాస్వామ్యంలో మరింత వేగవంతం చేయడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలతో సహా అందరికీ 33 శాతం  రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ధ్యేయమని వెల్లడించింది. 

బిల్లుల్లోని ముఖ్యాంశాలు

  •  నియోజకవర్గాలను పునర్విభజన చేసేం దుకు ఈ బిల్లు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడం ద్వారా లోక్‌‌‌‌సభలో రాష్ట్రాల నుంచి ఎన్నుకొనే సభ్యుల సంఖ్యను గరిష్టంగా 815కి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకొనే వారి సంఖ్యను 35కి పెంచనున్నారు.
  • 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వేగంగా అమలు చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. తదుపరి జన గణన,  ఆ తర్వాత జరిగే పునర్విభజన ప్రక్రియకు చాలా సమయం పడుతుంది కాబట్టి, ఇప్పటికే అందుబాటులో ఉన్న జనాభా లెక్కల (2011) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
  • 2029 ఎన్నికలనుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
  • ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలాంటి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తించేలా ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నది. 

కమిషన్‌‌‌‌ అధికారాలు, విధులు

  •  ప్రస్తుతం ఉన్న జనాభా గణాంకాల ఆధారంగా లోక్‌‌‌‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను డీలిమిటేషన్‌‌‌‌ కమిషన్ పునర్వ్యవస్థీకరిస్తుంది.
  •  ప్రస్తుతం లోక్‌‌‌‌సభ స్థానాలు 1971 జనాభా లెక్కల ఆధారంగా, నియోజకవర్గాల పరిధి 2001 లెక్కల ఆధారంగా ఉన్నాయి. మారిన జనాభాకు తగ్గట్టుగా వీటిని కమిషన్‌‌‌‌ మారుస్తుంది.
  • సాక్షులను పిలిపించడం, పత్రాలను తెప్పించుకోవడంలాంటి విషయాల్లో కమిషన్‌‌‌‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
  • కమిషన్ తన ప్రతిపాదనలను గెజిట్ ద్వారా పబ్లిష్ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తుంది. 
  • ఇందుకోసం పబ్లిక్‌‌‌‌ సిట్టింగ్స్‌‌‌‌ చేపడుతుంది.
  • కమిషన్ ఉత్తర్వులు గెజిట్‌‌‌‌లో ప్రచురితమైన తర్వాత వాటికి చట్టబద్ధత వస్తుంది. 
  • వీటిని ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి వీలుండదు.
  • కమిషన్ ఉత్తర్వులను కనీసం రెండు స్థానిక భాషా పత్రికల్లో, రేడియో, టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది.

సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో కమిషన్‌‌‌‌

డీలిమిటేషన్‌‌‌‌ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నది. దీనికి సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్​ చేసే ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌,  సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు.  కమిషన్‌‌‌‌కు సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది ప్రతినిధులను (ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు) నియమిస్తారు. అయితే, వీరికి నిర్ణయాలపై ఓటు వేసే హక్కు ఉండదు.