స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటుతున్నప్పటికీ సమాజంలో సగభాగం ఉన్న మహిళల స్థానం మాత్రం పురుషులతో సమానస్థాయికి చేరుకోలేకపోతోంది. భారతీయ సామాజిక నిర్మాణం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆంక్షలు, మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు.. మహిళలకు సంబంధించిన అనేక సామాజిక దురాచారాలు, సమస్యలు తలెత్తడానికి మూలకారణమయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మనదేశంలోనూ మహిళల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి అనేక మహిళా ఉద్యమాలు వస్తున్నాయి. మహిళల స్థితిగతులు మెరుగుపడనిదే సంక్షేమానికి ఆస్కారం లేదు.
ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, విద్య, వైద్య రంగాలన్నింటిలోనూ మహిళలపై వివక్ష నేటికీ కనపడుతున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల పట్ల ఈ వివక్ష ఇంకా ఎక్కువ. అయితే గత కొంతకాలంగా స్త్రీలు విద్యతోపాటు స్వయంగా ఆర్థికంగా ఎదుగుదలకు రాజకీయ చైతన్యంతో ముందుకు వస్తున్నారు. భారత రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్ స్త్రీలకు పురుషులతో సమానంగా సంపూర్ణ సమానత్వాన్ని ప్రసాదించాయి.73 వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. దీనిని అనుసరించే 21 రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50% కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలోని పంచాయతీలకు 14 లక్షల మందికిపైగా మహిళలు ప్రాతినిథ్యం వహిస్తూ విజయవంతంగా సేవలందిస్తున్నారు.
33% రిజర్వేషన్‌పై రాజకీయ పార్టీలలో చిత్తశుద్ధి ఎంత?
మహిళలకు సమానంగా రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానాలు ఇస్తుంటాయి. వాగ్దానాలు ఇవ్వడంలో నాయకులు ఒకరికొకరు పోటీపడుతుంటారు. తీరా కార్యాచరణకు వచ్చేసరికి మాటలకే పరిమితమవుతున్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు గత 30 సంవత్సరాలుగా అంటే 1996 సెప్టెంబర్‌లో ఆనాటి దేవగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
అయితే బిల్లులో జనరల్ మహిళా కోటాలో బడుగు మహిళలకు సబ్ కోటా లేకపోవడం, సంపన్న వర్గాలకే చాన్స్ ఎక్కువగా ఉంటుందని కొన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాయిదా పడింది. ఆ తరువాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ అదే పరిస్థితి. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదించినా లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉంది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు మురిగిపోయింది. లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 1952 నుంచి పరిశీలించితే నేటివరకు 15 శాతం మించలేదు.
మోదీ ప్రభుత్వం హడావుడి!
ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఎన్నికలలో లబ్ధి పొందేందుకుగాను గత మూడు దశాబ్దాలుగా పార్లమెంటు ఆమోదించకుండా ఉన్న బిల్లును హడావుడిగా 2023 సెప్టెంబర్ లో 'నారీ శక్తి వందన్ అధినియమ్' ( మహిళ రిజర్వేషన్ బిల్లు)ను ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా జరిగిన చర్చలలో 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్‌తోపాటు మిగతా ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు.. కుదరదంటూ రాజ్యాంగ అవరోధాలను ముందుకు తెచ్చారు. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం ఆమోదించిన రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదని తాజా జనాభా లెక్కల ప్రాతిపదికపై ఆ తదుపరి డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంటుందని.. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఎట్టకేలకు జనగణన
2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కొవిడ్ కారణంగా వాయిదా పడింది. కొవిడ్ పూర్తిగా అంతరించి మూడేళ్లు గడిచినా జనగణనను ప్రభుత్వం దాటవేస్తూ.. ఎట్టకేలకు ఈ సంవత్సరం 2026లో చేపడుతోంది. తొలిసారి డిజిటల్‌గా నమోదు చేస్తున్న వివరాలు క్రోడీకరించి గెజిటెడ్ ప్రకటన చేయటానికి కనీసం సంవత్సరకాలం అవసరం. ఆ తదుపరి నియోజకవర్గాల పునర్విభజన కనీసం మరో సంవత్సరం పైగా పడుతుంది. అందువల్ల 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలుపరిచే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు.
ఈలోపు ఒకే దేశం ఒకేసారి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ జరిగి దాని అమలు క్రమం ప్రారంభంకావచ్చు. ప్రస్తుతం ఆ బిల్లు జాయింట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నది. మహిళా రిజర్వేషన్ శాస్త్రీయంగా ఎలా పనిచేస్తుందన్న అంశంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం 33% రిజర్వేషన్ తో అసెంబ్లీ/ లోక్‌సభ సీట్లలో ఒక్కొక్కటి రొటేషన్ ఆధారంగా మహిళలకు కేటాయిస్తారు. అందులో ఎస్సీ, ఎస్టీ సబ్ కోటా ఉన్నా బీసీ, ఓబీసీ సబ్ కోటా లేదు. జనరల్ సీట్లు అగ్రవర్ణాలకు చెందిన మహిళలు మాత్రమే బరిలో ఉండే అవకాశం ఉన్నది.
ఎన్నికల్లో లబ్ధికోసమే ప్రత్యేక సమావేశం
మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించడం కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశం ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. మహిళల రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి, లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కి పెంచే బిల్లును ఆమోదించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించటం వెనుక ఉద్దేశం 5 రాష్ట్రాల ఎన్నికలలో లబ్ది పొందడమే.
ఎన్నికల దృష్ట్యా ఒక రకంగా మహిళల ఓట్లను పొందడం కోసమే. ప్రస్తుత ప్రచారంలో ఉన్న దాని ప్రకారం 543 లోక్‌సభ సీట్లలో రాష్ట్రాలవారీ సీట్లను 50 శాతం పెంచుతారు. దాంతో మొత్తం సీట్ల సంఖ్య 816కు పెరుగుతుంది. అందులో 33 శాతం(273) మహిళలకు రిజర్వ్ చేస్తారు.2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతారు. ఇది సింపుల్‌గా కనిపించినా, లోతైన సమస్య ఉన్నది. జనాభా నియంత్రణను పాటించి జాతీయ లక్ష్యాలను పరిపూర్తి చేసిన దక్షిణాది రాష్ట్రాల లోకసభ సీట్లు 66(129 నుంచి 195) పెరిగితే జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 200 పెరుగుతాయి.
అఖిలపక్ష పార్టీలతో చర్చించి.. సమగ్రంగా రూపొందించాలి
దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యత కోల్పోతాయని ఐదు, ఆరు పెద్ద ఉత్తరాది రాష్ట్రాలు కలిసి ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఈ అంశం లేవనెత్తారు. ఇదిలా ఉండగా గత పక్షం రోజుల్లో అమిత్ షా తదితర కొందరు మంత్రులు మహిళా రిజర్వేషన్ అమలుకు ఎన్డీఏ పార్టీలతో చర్చించటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అఖిలపక్ష పార్టీలతో చర్చించి సమగ్రంగా రూపొందించాల్సిన అవసరం ఉంది.
మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ ఆది నుంచి కట్టుబడి ఉందని.. 2023లో చేసిన చట్టంపై ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హడావుడిగా ప్రభుత్వం ఎందుకు సవరణలు చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్ముగిశాక అఖిలపక్ష పార్టీల సమావేశం పెట్టాలని డిమాండ్ చేశాయి. కానీ, అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం స్పందించకుండా ఏకపక్ష ధోరణి ప్రదర్శించటం కేంద్రం చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పకనే చెపుతోంది.
- ఉజ్జిని రత్నాకర్ రావు
సీపీఐ రాష్ట్ర నాయకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

