కేంద్రం తెచ్చిన కొత్త పాలసీ తో మూస చదువులకు చెక్

కేంద్రం తెచ్చిన కొత్త  పాలసీ తో మూస చదువులకు చెక్
  • కొత్త పాలసీతో విద్యావిధానం బాగుపడుతుంది

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినా ఇప్పటికీ బ్రిటిష్​ పాలకులు తెచ్చిన మెకాలే ఎడ్యుకేషన్​ సిస్టమే కొనసాగుతోంది. దీని వల్ల ఎడ్యుకేషన్​ సిస్టంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నాం. దీనిని గుర్తించిన నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్​ పాలసీని రూపొందించింది. ప్రస్తుతం 73 శాతం ఉన్న లిటరసీ రేటును 2030 నాటికి వంద శాతానికి చేర్చడమే దీని టార్గెట్.​స్కిల్స్​తో కూడిన ప్రొఫెషనల్​ కోర్సులు, రీసెర్చ్​లు, ప్రయోగాల కోసం నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ ఏర్పాటు, టెక్నికల్​ ఎడ్యుకేషన్​ను అన్ని స్థాయిల్లో ప్రోత్సహించడం లాంటి ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంది. దేశంలోని ప్రతి బిడ్డా సమానమైన ఎడ్యుకేషన్​ చాన్స్​లు పొందేలా 2050 నాటికి అవసరమైన పాలసీని రెడీ చేసింది. ఈ పాలసీకి గత ఏడాది జులైలో కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. రైట్​ టు ఎడ్యుకేషన్​ యాక్ట్–2009 ద్వారా చదువు అనేది ఓ హక్కుగా మారింది. దీని ప్రకారం దేశంలోని ప్రతి చిన్నారి విద్యను ఉచితంగా, నిర్భందంగా నేర్చుకోవాలి. కానీ, చట్టం వచ్చి పదేండ్లు గడుస్తున్నా అమలు మాత్రం జరగలేదు. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్లలోనే అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్లు అనేక రకాలుగా రూల్స్​ను ఉల్లంఘిస్తున్నాయి. కొత్త ఎడ్యుకేషన్​ పాలసీ ద్వారా దేశంలోని ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్(ప్రభుత్వ, ప్రైవేటు) ఒకే విధానాన్ని ఫాలో అయ్యేలా చర్యలు చేపట్టాలి.

మాతృభాషలో చదువు మంచి నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎడ్యుకేషన్​ పాలసీలో ప్రధానమైన అంశం 5వ తరగతి వరకు మాతృభాషలో చదువు చెప్పడం. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంటిల్లిపాది మాట్లాడే భాషను కాదని ఇంగ్లిష్​ మీడియంలో చదువు చెప్పడం వల్ల కొత్త భాషను నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. పిల్లల్లో టెన్షన్​ పెరిగి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. అదే మాతృభాషలో చదువు నేర్పితే స్టూడెంట్లు ఆడుతూ, పాడుతూ చదువుతారు. వారి స్కిల్స్​ కూడా పెరుగుతాయి. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఎడ్యుకేషన్​ సిస్టం ఉంది. కేంద్రం తెచ్చిన విధానాలను కచ్చితంగా రాష్ట్రాలు అమలు చేస్తాయనే నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో కమిషన్లు మాతృభాషలో చదువు చెప్పాలని సూచించినా అవన్నీ తుంగలో తొక్కేశారు.

అన్ని చోట్లా ఒకే విధానం ఉండాలి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాతృభాషలోనే చదువు కొనసాగేది. కానీ ఆ తర్వాత నుంచి ఇంగ్లిష్​ మీడియం ప్రభావం ఎక్కువైంది. 2000 సంవత్సరం తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో 50 శాతానికిపైగా ఇంగ్లిష్​ మీడియం ప్రభావం పెరిగింది. ఈ నేపథ్యంలో 5వ తరగతి వరకు మాతృభాషలో చదువు చెప్పాలనే నిర్ణయాన్ని అమలు చేయడం ఇబ్బందే. పేరెంట్స్​ ఇంగ్లిష్​ మీడియం మోజులో పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో నడిచే బడుల్లో మాతృభాషలోనే చదువు చెబుతున్నా వాటిలో పిల్లల అడ్మిషన్లు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రైవేటు స్కూళ్లు మాతృభాషను కాదని ఇంగ్లిష్ మీడియంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో టీచింగ్​ విషయంలో ద్వంద్వ విధానం ఉండకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5వ తరగతి వరకు మాతృభాషను తప్పనిసరి చేయాలి.

వెనకబడుతున్న పేద పిల్లలు

మరో కీలకాంశం పిల్లలు బుడిబుడి అడుగులు నేర్వగానే బడిలో ఉండటం. ప్రస్తుతం ఐదేండ్లకు 1వ తరగతిలో చేరే విధానం ఉంది. గతంలో వేసిన కొన్ని కమిషన్లు, రైట్​ టు ఎడ్యుకేషన్​ యాక్ట్–2009లో పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండకూడదని స్కూళ్లలో చేర్పించే వయసును 5 ఏండ్లుగా నిర్ణయించారు. కానీ ఇది ఆచరణలో సాధ్యపడడం లేదు. స్వాతంత్ర్యం రాక ముందు, ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో 5 సంవత్సరాలకు అడ్మిషన్లు ఇస్తుండటంతో పేరెంట్స్ తమ పిల్లలను ఐదేండ్ల వరకూ ప్రైవేటు బడుల్లో చదివించే వారు. అలాంటి స్కిల్స్​ పెరిగేవి. పేద వర్గాల పిల్లలు ఐదేండ్లు నిండిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పొందడం వల్ల మిగతా పిల్లల కంటే వెనకబడి ఉండేవారు. ఈ తేడా రాను రాను ప్రైవేటు స్కూళ్లు బలపడటానికి ఆస్కారం ఇచ్చింది. మూడేండ్లు నిండిన చిన్నారి ఎల్ కేజీ/యూకేజీ ప్రైవేటు స్కూళ్లలో ఐదేండ్లు నిండిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లకు రావడం సాధ్యపడకపోవడంతో ప్రైవేటు సెక్టార్​ బలపడింది.

5+3+3+4 విధానంలో చదువు

కొత్త ఎడ్యుకేషన్​ పాలసీలో గత చట్టాల్లో ఉన్న 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను 3 నుంచి 18 ఏండ్లకు మార్చారు. అంటే 5+ 3+ 3+ 4 విధానంలో చదువు సాగుతుంది. 3 సంవత్సరాలకే చిన్నారి స్కూల్​లో అడ్మిషన్​ పొందుతాడు. ఈ 15 సంవత్సరాల్లో 3 నుంచి 8 ఏండ్ల వరకు(ప్రీ పైమరీ నుంచి 2వ తరగతి వరకు) ఫౌండేషన్​ స్టేజ్, 8 నుంచి 11 సంవత్సరాల వరకు(3 నుంచి 5వ తరగతి వరకు) ప్రిపరేటరీ స్టేజ్, 11 నుంచి14 ఏండ్ల వరకు(6 నుంచి 8వ తరగతి వరకు) మిడిల్​ స్టేజ్, 14 నుంచి 18 సంవత్సరాల వరకు(9 నుంచి 12వ తరగతి వరకు) సెకండరీ స్టేజ్​గా ఎడ్యుకేషన్​ ఉంటుంది. తొలి మూడేండ్లు అంగన్ వాడీ లేదా ప్రీస్కూలింగ్ ఉంటుంది. పిల్లల శారీరక, మానసిక వికాసంతోపాటు సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతిక అభివృద్ధి, కళల పట్ల ఆసక్తి, భావ ప్రకటన సామర్థ్యం పెంచేలా చదువు సాగుతుంది. కళలు, కథలు, కవితలు, పాటలు మొదలైన అంశాలతో సిలబస్ రూపొందిస్తారు. అలాగే ప్రతి స్టూడెంట్​ అంకెలు, అక్షరాలను గుర్తించేలా తీర్చిదిద్దుతారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర విద్యా శాఖ ‘‘నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషనల్ లిట్రసీ అండ్ న్యూమరసీ’’ని ఏర్పాటు చేస్తుంది. మూడేండ్ల నుంచే అడ్మిషన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రీప్రైమరీ క్లాసులు అఫీషియల్​గా మొదలైతే ఎడ్యుకేషన్​ సిస్టం బలోపేతం అవుతుంది.

మూస చదువులకు స్వస్తి

12వ తరగతి వరకు స్కూల్​ ఎడ్యుకేషన్​లో చేర్చడం కూడా మంచి నిర్ణయం. 1970కి పూర్వం పీయూసీ ఉన్నప్పుడు 12వ తరగతి వరకు స్కూల్​ ఎడ్యుకేషన్​లోనే ఉండేది. అయితే ఆ తర్వాత టెన్త్​ వరకే దానిని మార్పు చేశారు. దీని వల్ల చాలా మంది పిల్లలు10వ తరగతి వరకు చదివి మానేసేవారు. గతంలో టెన్త్​ క్లాస్​ వరకు అన్ని సబ్జెక్టుల్లో మూస పద్ధతుల్లో చదువు కొనసాగేది. ఉదాహరణకు మ్యాథ్స్ విషయానికి వస్తే 10వ తరగతి వరకు స్టూడెంట్​కు ఇష్టం ఉన్నా, లేకున్నా, ఇంటర్ లో ఆర్ట్స్​ కోర్సులు, ఐఐటీల్లో చేరాలనుకునే వారు కూడా మ్యాథ్స్​ తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చేది. దీంతో 10 శాతానికి మించి స్టూడెంట్లు మ్యాథ్స్​ను అవగాహన చేసుకోలేక వెనకబడిపోయేవారు. కొత్త పాలసీలో 8వ తరగతి వరకు మ్యాథ్స్​ బేసిక్స్​ వరకు స్టూడెంట్​ నేర్చుకుంటారు. ఆ తర్వాత వారి అభిరుచిని బట్టి సబ్జెక్ట్​ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే 6వ తరగతి నుంచి ఒకేషనల్​ కోర్సులను ప్రోత్సహించడం వల్ల ఇష్టమున్న స్టూడెంట్లు అటు వెళతారు.-పులి సర్వోత్తమ్ రెడ్డి, బీజేపీ రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయిస్ సెల్ కో-చైర్మన్.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!